లోవలో భక్తుల సందడి

పిఠాపురం చేరిన కొత్త 104 వాహనాలు - Sakshi

తుని రూరల్‌: ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం ఎనిమిది వేల మంది దర్శించుకున్నారని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. రవ్వలడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.76.875, పూజా టికెట్లకు రూ.30,420, కేశఖండన శాలకు రూ.3,775, వాహన పూజలకు రూ.4,190, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెల రూపేణా రూ.68,900, విరాళాలుగా రూ.70,334 కలిపి మొత్తం రూ.2,54,494 ఆదాయం లభించిందని వివరించారు. భక్తులకు అవసరమైన సదుపాయాలను చైర్మన్‌ గొర్లి అచ్చియ్యనాయుడు, సిబ్బందితో కలసి ఈఓ విశ్వనాథరాజు పర్యవేక్షించారు. వర్షం కారణంగా ఆరుబయట చెట్ల కింద వంటలు, భోజనాలు చేసే భక్తులు ఇబ్బందులు పడ్డారు.

సీహెచ్‌సీకి రెండు

కొత్త 104 వాహనాలు

పిఠాపురం: స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)కి ప్రభుత్వం రెండు 104 కొత్త వాహనాలను కేటాయించింది. ఈ వాహనాలు ఆదివారం ఇక్కడకు చేరుకున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ల్‌ ద్వారా వైద్య సేవలు విస్తృతం చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వాహనాలను అందించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఘనంగా వృక్షయజ్ఞం

అన్నవరం: వృక్షయజ్ఞం పేరుతో సత్యగిరిపై మొక్కలు నాటే కార్యక్రమానికి అన్నవరం దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ ఆదివారం శ్రీకారం చుట్టారు. సిబ్బందితో కలిపి సత్యగిరిపై సత్యదేవ స్మార్త, ఆగమ పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టారు. దేవతా వృక్ష జాతులైన ఉసిరి, మామిడి, నేరేడు, బొగడ, పనస, జమ్మి, కదంబం, వేప, సంపెంగ, టెంపుల్‌ ట్రీ, దేవకాంచన, రుద్రాక్ష, బాదం తదితర 13 రకాల మొక్కలు నాటారు. స్వామివారి పూజా కై ంకర్యాల్లో ఉపయోగించే పుష్పాల మొక్కలు నాటడం సంతోషంగా రోహిత్‌ ఈ సందర్భంగా అన్నారు. ఈ మొక్కలను కాపాడేందుకు శ్రద్ధ తీసుకోవాలని గార్డెన్‌ సిబ్బందిని ఇన్‌చార్జి ఈఓ ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ అజాద్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డు సభ్యుడు పేరూరి బద్రీనారాయణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌బాబు, దేవస్థానం పండితులు పాల్గొన్నారు.

గంజాయి తరలిస్తున్న

ఆరుగురి అరెస్టు

రాజమహేంద్రవరం రూరల్‌: ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం ప్రకారం.. ముందుగా అందిన సమాచారం మేరకు బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై జగన్‌మోహన్‌ తన సిబ్బందితో దివాన్‌చెరువు పండ్ల మార్కెట్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలానికి ఆదివారం చేరుకున్నారు. అక్కడ బొలేరో వాహనం నుంచి కారులోకి గంజాయిని మారుస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. వారిని విచారించగా ఒడిశాలోని చింతాడ నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్నట్టు తేలింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం రాజవరం గ్రామానికి చెందిన బర్ల రాజబాబు, కొప్పు రాంబాబు, కొప్పు సత్తిబాబు, గుండిపాల గ్రామానికి చెందిన యెన్నేటి దుర్గాప్రసాద్‌, తమిళనాడుకు చెందిన ఆర్‌.దినేష్‌కుమార్‌, అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెదపూడి గ్రామానికి చెందిన బొట్టా శివకుమార్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి 170 కిలోల గంజాయి, రూ.3.52 లక్షల నగదు, బొలేరో వాహనం, కారు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Kakinada News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top