కాకినాడ సిటీ: ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, రెండు మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చేతికి అంది వస్తున్న వరి పైరుకు ఈ వర్షం చేటు తెస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే మెట్ట ప్రాంతంలోని మామిడి, కూరగాయలు, ఆకుకూర పంటలకు ఈ వర్షాలు కొంత మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ 33.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ప్రత్తిపాడులో 55.4, అత్యల్పంగా యు.కొత్తపల్లి మండలంలో 15.6 మిల్లీమీటర్లు నమోదైంది.
మండలాల వారీగా వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో.. గండేపల్లి 53.2, కిర్లంపూడి 52.4, తాళ్లరేవు 49.4, గొల్లప్రోలు 42.2, తుని 41.6, శంఖవరం 41, రౌతులపూడి 36.8, కాకినాడ అర్బన్ 35.6, తొండంగి 33.6, జగ్గంపేట 28.6, ఏలేశ్వరం 28.2, కాజులూరు 26.4, కాకినాడ రూరల్ 26.2, సామర్లకోట 23, పిఠాపురం 21.2, పెదపూడి 19.6, పెద్దాపురం 18.6, కరప 16.4.