
కాకినాడ సిటీ: ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు సంబంధించి వివిధ అవసరాల కోససం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు శనివారం వారి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణలు శనివారం తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ యాజమాన్యంలో పని చేస్తూ ఉద్యోగ విరమణ చేసిన, మరణించిన ఉపాధ్యా, ఉపాధ్యాయేతర సిబ్బందికి కూడా తుది చెల్లింపులు చేసినట్లు మీడియాకు వివరించారు. ప్రస్తుత సిబ్బందిలో కొందరి ఆర్ధిక అవసరాలకు అనుగుణంగా సొమ్ము జమ చేశామన్నారు. 1244 మందికి రూ. 54,93,25,447 వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జెడ్పీ చైర్మన్ తెలిపారు.
రూ.3.76 లక్షల విలువైన
సరుకు జప్తు
కాకినాడ సిటీ: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలకు సంబంధించి నమోదైన ఏడు కేసులను విచారించి రూ.3,76,276 విలువైన సరుకును ప్రభుత్వానికి జప్తు చేస్తూ ఉత్తర్వులిచ్చినట్లు జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ శనివారం తెలిపారు. ఈ మొత్తం పౌరసరఫరాల ఖాతాకు జమ అవుతుందన్నారు. వంట గ్యాస్ సిలిండర్‌ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించిన దుకాణ యజమానులకు రూ.10వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి పీడీఎస్ బియ్యం, తదితర నిత్యావసర వస్తువులు అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరించారు.
వేగవంతంగా
దత్తత కార్యక్రమాలు
కాకినాడ సిటీ: జిల్లాలోని చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్లలో అర్హులైన పిల్లల జాబితాలను తయారు చేసి జిల్లా బాలల సంక్షేమ సమితి అనుమతితో దత్తత కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కె ప్రవీణ అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ శిశు గృహలో దత్తత ప్రక్రియపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దత్తత కార్యక్రమం, కేర్‌పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. శిశు గృహలోని పిల్లల పరిస్థితులపై ఆరా తీశారు. పిల్లలు ఎవరైనా దొరికినప్పుడు ఏఏ శాఖల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. దత్తత ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పిల్లలు లేని తల్లిదండ్రులు వెబ్‌సైట్ ద్వారా దత్తతకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిశుగృహలో ప్రతి మంగళవారం దత్తత ప్రక్రియపై కౌన్సిలర్ ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లా బాలల సంక్షేమాధికారులు సిహెచ్ వెంకటరావు, పి లక్ష్మి, బి రామకోటి, ఎం సుధాకర్, ఎ నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.