సుంద‘రుడా’యే లక్ష్యం..

- - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (రుడా) పరిధిలో సుందరీకరణ, పలు రకాల అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. రూ.18 కోట్ల బడ్జెట్‌ అంచనాలతో భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు సంబంధించి ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ఈ మేరకు శనివారం స్థానిక రుడా కార్యాలయ సమావేశ మందిరంలో రుడా నాలుగో బోర్డ్‌ సమావేశం వేదికై ంది. ప్రజా ప్రయోజనం, ఆరోగ్య రక్షణ, ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పే పనులకు బోర్డు ప్రాధాన్యం ఇస్తోంది. రుడా చైర్‌పర్సన్‌ షర్మిలా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత బోర్డు మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సభ్యులు చర్చించారు. ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. తాజాగా రూ.18 కోట్ల పనులను ప్రతిపాదించగా బోర్డు ఆమోదముద్ర వేసింది.

బోర్డు ఆమోదించిన పనులను పరిశీలిస్తే..

● రుడా పరిధిలో నిర్వహించే పనుల్లో పట్టణాల సుందరీకరణ, వాకింగ్‌ ట్రాక్‌లు, రివిట్‌మెంట్‌తో కూడిన వాటర్‌ బాడీ, బీచ్‌ ఫ్రంట్‌ నిర్వహణ లాంటి పనులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

● అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో రూ.1.50 కోట్లతో వాకింగ్‌ ట్రాక్‌, రివిట్‌మెంట్‌తో కూడిన వాటర్‌ బాడీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

● కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం వద్ద వార్ఫ్‌ రోడ్డు వద్ద రూ.1.50 కోట్లతో రివర్‌ ఫ్రంట్‌ పనులకు మార్గం సుగమమైంది. దీంతో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్నదే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు.

● నిడదవోలు మున్సిపాలిటీలోని చిన్న కాశీ రేవు నుంచి గూడెం గేటు వరకు రహదారి నిర్మాణానికి రూ.కోటి వెచ్చించనున్నారు.

● గోష్పాద క్షేత్రం సమీపంలోని కొవ్వూరు కట్ట వెంబడి రివర్‌ ఫ్రంట్‌ ప్రాంతం అభివృద్ధి చేపట్టి భక్తులకు స్వాంతన కలిగించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు గాను రూ.1.25 కోట్లు ఖర్చు చేయనున్నారు.

● రుడా ఏర్పడి ఏడాది దాటినా నేటికీ సొంత కార్యాలయం లేదు. రూ.10 కోట్లతో రుడా కార్యాలయ నిర్మాణానికి బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

● విమాన ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు వెంబడి ఉన్న సెంట్రల్‌ లైటెనింగ్‌ పోల్స్‌కు ఎల్‌ఈడీ మోటిఫ్‌ ఏర్పాటుకు రూ.75 లక్షలు వెచ్చించనున్నారు.

● రూ.2 కోట్లతో కోరుకొండ జంక్షన్‌ వద్ద ఆర్టీసీ బస్‌స్టాప్‌ పునరుద్ధరణ, సుందరీకరణ, వసతుల కల్పనకు బోర్డు ఆమోదం తెలిపింది.

Read latest Kakinada News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top