శివారు ప్రాంతాలకు ఆనంద‘జల్లు’ | Sakshi
Sakshi News home page

శివారు ప్రాంతాలకు ఆనంద‘జల్లు’

Published Sun, Mar 19 2023 2:18 AM

కిర్లంపూడి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ప్రధాన రహదారిపై నిలిచిన వర్షపు నీరు  - Sakshi

జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం

వరికి ఇబ్బంది లేదంటున్న

అధికారులు

బోట్‌క్లబ్‌ (కాకినాడసిటీ): బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. వానలపై ఇప్పటికే రైతాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి కొద్దిపాటి వాన కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి దపదపాలుగా వర్షం కురిసింది. ఉదయం ఎండకాసినా, మధ్యాహ్నం 12 గంటలు నుంచి రాత్రి వరకూ మోస్తరు వర్షం కురవడంతో సాధారణ జనజీవనానికి ఇబ్బంది తప్పలేదు. జిల్లా కేంద్రమైన కాకినాడలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ చినుకులు పడుతూనే ఉన్నాయి. తుని, పిఠాపురంలో ఓ మాదిరి వర్షం పడింది. జిల్లాలో కిర్లంపూడి, రౌతులపూడి మండలాల్లో అధిక వర్షం పాతం నమోదయ్యింది. ప్రస్తుత వర్షాలు కారణంగా వరి పంటలకు ఎటువంటి నష్టం లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో 1.89 ఎకరాల్లో వరిసాగు అవుతుండగా వర్షాలు వరి పంటకు ఎంతో మేలు చేస్తాయని జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌ విజయకుమార్‌ తెలిపారు. శివారు ప్రాంత రైతులు నీరు అందక ఇబ్బంది పడుతున్న తరుణంలో వర్షాలు రావడంతో సాగునీరు ఇబ్బంది ఉండదన్నారు. వరి పువ్వారం దశలో ఉందని, ఈ వర్షాలు ఎటువంటి ఇబ్బంది ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. కొన్నిచోట్ల వరి పంట ప్రస్తుతం గింజ పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టి పడే దశకు చేరుకుంది. వర్షాలు తగ్గే వరకూ పంట కోతలను ఆపాలని వీరు చెబుతున్నారు.

జిల్లాలో వర్షం పాతం ఇలా:

కిర్లంపూడి 2.0, రౌతులపూడి 2. 0, కాకినాడ అర్భన్‌ 1.4, పెద్దాపురం 1.8, కోటనందూరు 1.6, కాకినాడ రూరల్‌ 1. 8 , తొండంగి 1.4 , శంఖవరం 1.2, సామర్లకోట 1.2, కాజులూర 0.8 , యూ కొత్తపల్లి 0.8 , గొల్లప్రోలు 0.8 ,తుని 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైయ్యింది.

Advertisement
Advertisement