టీజీజీడీఏ జిల్లా అధ్యక్షుడిగా నాగేశ్వరావు | - | Sakshi
Sakshi News home page

టీజీజీడీఏ జిల్లా అధ్యక్షుడిగా నాగేశ్వరావు

May 1 2026 5:57 AM | Updated on May 1 2026 5:57 AM

గద్వాల క్రైం: తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల్లో స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.నాగేశ్వరావు అధ్యక్షుడిగా ఎన్నికై నట్లు రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ కె.శ్రీనివాస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారిగా జిల్లా ప్రభుత్వ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు నిర్వహించగా.. పలువురు వైద్యులు పోటీచేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యక్షులుగా డా.శ్యామ్‌, డా. ఎస్‌కే సిద్ధప్ప, కె.రాణి, జనరల్‌ సెక్రెటరీగా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఇందిరా, జాయింట్‌ సెక్రెటరీలుగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ సంధ్యా కిరణ్మయి, నవీన్‌క్రాంతి కుమార్‌, వృశాలి, జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులుగా వెంకటదాస్‌, రమేశ్‌చంద్ర, నరహరి, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా వినోద్‌కుమార్‌, ప్రియాంక ఎన్నికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. నూతన కమిటీ సభ్యులను పలువురు ఆభినందించారు.

నాసిరకం విత్తనాలు విక్రయిస్తే చర్యలు

ధరూరు: విత్తన డీలర్లు రైతులకు నాసిరకం విత్తనాలు అంటగట్టి మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప హెచ్చరించారు. గురువారం ధరూరు రైతువేదికలో మండలంలోని సీడ్‌ విత్తన డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న వానాకాలంలో రైతులకు అవసరమయ్యే వివిధ రకాల విత్తనాలతో పాటు పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విత్తన విక్రయాలకు సంబంధించిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. అదే విధంగా స్టాక్‌ బోర్డుపై రోజువారీగా ధరలను రాసి ఉంచాలన్నారు. విత్తనాలు కొనే రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలన్నారు. రైతులు కూడా విత్తనాలకు సంబంధించిన రశీదులను పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అల్వలపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేశారు. డీఏఓ వెంట ఏఓ శ్రీలత, ఏఈఓలు ఉన్నారు

జాతీయ ఫుట్‌బాల్‌

పోటీలకు ఎంపిక

వనపర్తి రూరల్‌: పెబ్బేరుకు చెందిన పరమేష్‌ జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు కోచ్‌ నాగరాజు గురువారం తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (టీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో జరిగిన అండర్‌–20 జట్టు ఎంపికలో పరమేష్‌ అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. మే నెల 3 నుంచి 25వ తేదీ వరకు ఛత్తీస్‌ఘడ్‌లో జరిగే జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడతారని పేర్కొన్నారు. గురువారం పట్టణంలో జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణకుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, వెంకట్‌, అఫ్సర్‌, రాజేందర్‌, సీనియర్‌ క్రీడాకారులు పరమేష్‌ను అభినందించారు.

వేరుశనగ క్వింటా రూ.6,789

గద్వాలవ్యవసాయం/దేవరకద్ర: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువా రం 89 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,789, కనిష్టంగా రూ. 4,229, సరాసరి రూ. 5,889 ధర పలికింది. అదే విధంగా 95 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,059, కనిష్టంగా రూ. 5,219, సరాసరి రూ. 5929 ధర లభించింది. 11 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 6,569, కనిష్టంగా రూ. 6,069, సరాసరి రూ. 6,559 ధరలు వచ్చాయి. 2,018 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,136, కనిష్టంగా రూ. 1,729, సరాసరి రూ. 1,919 ధరలు లభించాయి.

● దేవరకద్ర మార్కెట్‌ యార్డులో జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,319, కనిష్టంగా రూ.1,949 ధరలు పలికాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,820, కనిష్టంగా రూ.1,709 ధరలు లభించాయి. మార్కెట్‌కు దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement