 
															మూగరోదన..!
● జీవాలకు అందని నట్టల నివారణ మందులు
● రెండున్నరేళ్లుగా నిలిచిన సరఫరా
● పెంపకందారులపై ఆర్థికభారం
మేకలు:
65,000
జిల్లాలో గొర్రెల సంఖ్య: 5,40,000
గద్వాల వ్యవసాయం: జిల్లాలో మూగజీవాలకు సరైన వైద్యం అందడంలేదు. కనీసం జీవాల్లో నట్టల నివారణకు కూడా మందులు లేని దయనీయ పరిస్థితి నెలకొంది. గడిచిన రెండున్నరేళ్లుగా నట్టల నివారణ మందులు పశుసంవర్ధకశాఖకు సరఫరా కావడం లేదు. దీంతో చేసేది లేక గొర్రెల, మేకల పెంపకందారులు ప్రైవేట్‌గా మందులు కొని జీవాలకు తాపిస్తున్నారు.
చలి, వర్షాకాలంలో తీవ్ర ప్రభావం
బాహ్య, అంతర్ పరాన్నజీవులుగా నట్టలు రెండు రకాలుగా ఉంటాయి. బాహ్య పరాన్నజీవులు (టిక్స్, ఫ్‌లైస్, మైక్స్) మూడు రకాలుగా ఉంటాయి. ఇవి మేకలు, గొర్రెల శరీరంపై బాగాన అంటే చెవులు, గొంతు కింద, పొదుగు వద్ద ఏర్పడతాయి. ఇక అంతర్ పరాన్న జీవులు నులిపురుగులు, పొట్టజలగలు, బద్దెపురుగులుగా మూడు రకాలుగా ఉంటాయి. ఇవి శరీరం లోపల కాలేయం, పేగులు తదితర వాటిలో ఏర్పడతాయి. ఇలా అంతర్, బాహ్య పరాన్న జీవులను నట్టలు అని పిలుస్తారు. నట్టలు ప్రధానంగా వర్షాకాలం, చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏర్పడతాయి. ఈ వ్యాదిగ్రస్థ జీవాలు ఆరుబయట మేతపైన కాని, తాగునీటిపైన కానీ మల విసర్జనచేస్తే... ఆమేతను తిన్న, ఆనీటిని తాగిన ఇతర ఆరోగ్యకరమైన జీవాల్లో కూడా నట్టలు ఏర్పడతాయి. నట్టలు ఏర్పడితే జీవాలు మేత తినక బలహీనంగా మారుతాయి. ఆ తర్వాత రక్తహీనత, తీవ్ర అనారోగ్యానికి గురవుతాయి. బరువు తగ్గి కొన్ని సందర్బాల్లో మృతి చెందుతాయి.
బడ్జెట్ కేటాయింపు ఏది..?
జీవాల్లో నట్టల నివారణకు మందుల కోసం పశుసంవర్ధకశాఖకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించేది. ఈ బడ్జెట్‌తో ప్రతి ఏటా రెండు నుంచి మూడు విడతలుగా (జనవరి నుంచి ఫిబ్రవరి, జూన్ నుంచి జూలై, అక్టోబర్ నుంచి నవంబర్) ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆల్బెండజోల్, ఫిల్మెండజోల్ మందులను జీవాలకు తాపించేవారు. ఇందుకోసం పశుసంవర్ధకశాఖ సిబ్బంది ఆయా మండలాల్లో బృందాలుగా ఏర్పడి, పెంపకందారులకు ముందస్తు సమాచారం అందించి మందులు వేసేవారు. అయితే గడిచిన రెండున్నరేళ్లుగా బడ్జెట్ కేటాయింపు లేకపోవడం వల్ల మందులు రావడం లేదు. జీవాలను పెంచుతున్న పెంపకందారులు చేసేది లేక రూ.వేలకు వేలు వెచ్చించి ప్రైవేట్‌గా మందులను తెచ్చుకుంటున్నారు. జీవాల్లో ప్రతి సీజన్‌లో నట్టలు ఏర్పడతాయి. ఈ మందులు తాపించకపోతే నట్టలు ఎక్కువ అవుతాయి. జీవాల బాహ్య, అంతర్ శరీర భాగాల్లో నట్టల తీవ్రత ఎక్కువై అవి మృతి చెందే ప్రమాదం ఉంటుంది. దీంతో పెంపకందారులు జీవాలకు తప్పక మందులు తాపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా కాకపోవడం వల్ల వారికి ఆర్థికంగా భారంగా ఉన్నప్పటికీ మందులు వేయాల్సిన పరిస్థితి.
 
							మూగరోదన..!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
