 
															రూ.7.74 కోట్ల ‘ఉపాధి’ పనులపై సోషల్ ఆడిట్
ధరూరు: జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పథకం కింద మండలంలో రెండేళ్లలో జరిగిన పనులపై సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) నిర్వహించారు. 2024, 2025లో జరిగిన రూ.5.74 కోట్ల వేజ్ పనులు, అలాగే రూ.1.26 కోట్ల విలువగల మెటీరియల్ పనులు మొత్తం రూ.7.74 కోట్ల విలువ గల పనులపై గత రెండు నెలల క్రితం సోషల్ ఆడిట్ అధికారులు గ్రామాల్లో విచారణ చేపట్టారు. వాస్తవానికి నెల రోజుల క్రితమే పబ్లిక్ హియరింగ్ కార్యక్రమం జరగాల్సి ఉన్నా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడింది. గురువారం ఉదయం 10.40గంటలకు ధరూరులోని ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్ హాల్‌లో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 28 గ్రామ పంచాయతీలకుగాను రాత్రి 9 గంటల వరకు 20 గ్రామ పంచాయతీల వివరాలను, నివేదికలను సోషల్ ఆడిట్ డీఆర్‌పీలు చదివి వినిపించారు. ఏపీడీ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి డీఆర్‌డీఓ నర్సింగరావు ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా జరిగిన పనులు, అజరిగిన అవకతవకలపై డీఆర్‌పీలు నివేదికలను సభలో చదివి వినిపించారు. ఏ గ్రామంలో ఎంత మేర పనులు జరిగాయి.. ఎంత వరకు అక్రమాలు జరిగాయనేది సమావేశం పూర్తయ్యాకే నివేదిక ఇవ్వనున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు కార్యక్రమం కొనసాగింది. మొత్తంగా రూ.5,77,447 రికవరీకి అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అశోక్, ఎస్‌ఆర్‌పీ బద్రు నాయక్, డిస్టిక్ అంబుడ్స్‌మెన్ జమ్మన్న, ఎంపీడీఓ క్రిష్ణమోహన్, పీఆర్ ఏఈ నాగరాజు, ఏపీఓ శరత్ బాబు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, డీఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.
రూ.5.77 లక్షలు రికవరీకి
అధికారుల ఆదేశం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
