 
															రైతన్నకు కన్నీరే దిక్కు..!
● ముంచిన ‘మోంథా’ 
ఉమ్మడి జిల్లాలో 36,970 ఎకరాల్లో పంట నష్టం 
● కోత దశలో వరద నీటిలో నేలవాలిన వరి
● ఏరే దశలో చేన్లలోనే
తడిసి ముద్దయిన పత్తి
● నాగర్‌కర్నూల్ జిల్లాలో అధిక ప్రభావం
● ఆ తర్వాత వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలో..
● నష్ట పరిహారం ఇవ్వాలని
అన్నదాతల వేడుకోలు
జిల్లాల వారీగా ఇలా..
నాగర్‌కర్నూల్ జిల్లాలో వరితోపాటు పత్తికి భారీ నష్టం వాటిల్లింది. కల్వకుర్తి మండలంలో 4,430 ఎకరాల్లో పత్తి, 2699 ఎకరాల్లో వరి.. ఉప్పునుంతల మండలంలో 3,500 ఎకరాల్లో పత్తి, 2500 ఎకరాల్లో వరి, వంగూరు మండలంలో 1180 ఎకరాల్లో పత్తి, 1,080 ఎకరాల్లో వరి.. చారకొండలో 3,149, వెల్దండలో 1,376, అచ్చంపేటలో 2,100, అమ్రాబాద్‌లో 1076, పదర మండలంలో 1012 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
● వనపర్తి జిల్లాలో గోపాల్‌పేట మండలంలో 475, వీపనగండ్ల మండలంలో 443, పెద్దమందడిలో 217, రేవల్లిలో 120 ఎకరాల్లో వరి, చిన్నంబావి మండలంలో 750 ఎకరాల్లో ఉల్లిగడ్డ, వీపనగండ్ల మండలంలో 43 ఎకరాల్లో కంది పంట దెబ్బతింది.
● మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా జడ్చర్ల మండలంలో 217, మిడ్జిల్ మండలంలో 180, రాజాపూర్‌లో 105, అడ్డాకుల, బాలానగర్ మండలాల్లో 100 ఎకరాల చొప్పున వరి నీటిపాలైంది. వారం, పది రోజుల్లో కోతకు రెడీగా ఉన్న పంట నీటిపాలుకావడంతో అన్నదాతలు గుండెలివిసేలా రోదిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మోంథా తుపాను రైతులను నట్టేట ముంచింది. సుమారు రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు నీటిపాలయ్యాయి. ప్రధానంగా కోత దశలో ఉన్న వరి.. ఏరే దశలో ఉన్న పత్తికి భారీ నష్టం వాటిల్లింది. వీటితో పాటు వేరుశనగ, మినుములు, మొక్కజొన్న, ఉల్లిగడ్డ పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెత్తగా పంట చేలల్లో ఇసుక మేటలు వేయడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో అధికం..
● ఉమ్మడి పాలమూరులోని నాగర్‌కర్నూల్ జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తంగా 14,388 మంది రైతులకు సంబంధించి 33,559 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వనపర్తి జిల్లాలో 1,336 మంది రైతులకు చెందిన 2,270 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,013 మంది రైతులకు సంబంధించి మొత్తం 1,141 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
పరిహారం ఇవ్వాలని వేడుకోలు..
ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతులకు నష్టం వాటిల్లుతూ వస్తోంది. గతేడాది వానాకాలం సీజన్‌తో దోబూచులాడిన వరుణుడు.. ఆ తర్వాత కాత, పూత దశలో దంచికొట్టిన వానలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈసారి సైతం అధిక వర్షా లు రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా వరి, పత్తి రైతులకు పెట్టు బడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
