
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై పోరాటం
గద్వాలటౌన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సమస్యల సాధన కోసం దశల వారీగా పోరాటం సాగిస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) నాయకులు అన్నారు. సోమవారం కమిటీ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు గోపాల్, ప్రభాకర్‌శాస్త్రి, ఉదయ్‌కిరణ్, హరిబాబు మాట్లాడారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని, పీఆర్సీని ప్రకటించి పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్‌ను రద్దుచేసి, ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ 25ను సవరించాలని, 317 జీఓ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ, వారి సొంత జిల్లాలకు పంపాలని కోరారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలానికి పూర్తి వేతనం చెల్లించాలని, టైం స్కేల్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం ఈ నెల 23, 24వ తేదీలలో తహశీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వాలన్నారు. ఆగస్టు 1న జిల్లా కేంద్రాలలో ధర్నా చేపట్టి, ఆగస్టు 23న హైదరాబాద్‌లో చేపట్టే మహాధర్నాకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూఎస్‌పీసీ నాయకులు ప్రభాకర్, వెంకటరమణ, హనుమంతు, చంద్రకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల
ఎన్నికలకు సిద్ధం కావాలి
గట్టు: బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంజీవ్‌భరద్వాజ్ అన్నారు. సోమవారం సాయంత్రం గట్టులో బీజేపీ పార్టీ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఓటర్లు బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, నాయకులు, కార్యకర్తలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కలిసికట్టుగా పని చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులను అందిస్తోందని, రైతు వేదికల నిర్మాణాలు, ఉచిత బియ్యం, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాల నిర్మాణాలు, ఎరువుల రాయితీ, పీఎం విశ్వకర్మ, ముద్రలోన్స్, అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అందించే పౌష్టికాహారం వరకు కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూర్చుతున్నట్లు తెలిపారు. కేంద్రంలోని నరేంద్రమోడీదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ఓటర్లకు వివరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైనట్లు ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు బల్గెర శివారెడ్డి, గట్టు మధుసూదన్‌రావు, మాచర్ల సురేష్,నాగప్ప, గోవిందు, కిట్టుస్వామి,సంజీవనాయుడు, నర్సింహులు, వెంకటేష్, రాఘవేంద్ర, జనేయగౌడు,శ్రీరాములు,గౌడురమేష్‌గౌడు,బెల్లంనర్సింహులు, లింగన్న పాల్గొన్నారు.
రైతులే నడుం బిగించి.. జమ్ము తొలగించి
పాన్‌గల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–1 కాల్వలో నీటి పారుదలకు అడ్డంకిగా మారిన జమ్ము, పిచ్చిమొక్కల తొలగింపునకు ఆయకట్టు రైతులు నడుం బిగించారు. కాల్వలో పూడిక తీయించడంతోపాటు జమ్ము, పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో రైతులే స్వయంగా రంగంలోకి దిగారు. రోజుకు కొంతమంది చొప్పున మూడు రోజులుగా కాల్వలో పెరిగిన జమ్ము, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. అయితే సంబంధిత అధికారులు స్పందించి కేఎల్‌ఐ డీ–1 కాల్వకు మరమ్మతు చేయించడంతోపాటు పూడిక, జమ్మును పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు.

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై పోరాటం