
మహిళలు కోటీశ్వర్లుగా ఎదగాలనేదే ఆకాంక్ష
గట్టు: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని, మహిళలు కోటీశ్వర్లుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం గట్టులో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహించారు. ముఖ్య అథితులుగా ఎమ్మెల్యే, కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే నియోజక వర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని తెలిపారు. గట్టు మండలానికి ఇందిరమ్మ ఇళ్లు 780 మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయానికి సాగు నీటిని అందించడం ద్వారా గట్టు ప్రాంతం వలస నుంచి గట్టేక్కి, ఇక్కడికే ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చే విధంగా మారిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైనవారందరికి అందించే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
మహిళలందరూ చదువుకోవాలి : కలెక్టర్
మహిళలందరూ తప్పనిసరిగా చదువుకోవాలని, అప్పుడే ఆ కుటుంబం అభివృద్ది చెందుతుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గట్టు మండలంలో కేవలం మహిళా అక్షరాస్యత 50 శాతం మాత్రమే ఉందని, రాబోయే రోజుల్లో ఇది 100 శాతానికి చేరుకోవాలని కోరారు. ముఖ్యంగా అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారని, ఇది చాలా పెద్ద తప్పు అని అన్నారు. అమ్మాయిలను కూడా చదివించాలని, మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం సోలార్ విద్యుత్ ప్లాంటు,పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు,బస్సులకు యజమానులుగా చేస్తుందని, గోనుపాడు, అలంపూర్‌లో సోలార్ విద్యుత్ ప్లాంటు, పెట్రోల్ బంకు ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వం కొత్తగా 1700 రేషన్ కార్డులను, రూ.2030 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు మంజూరు చేసిందన్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షల బీమాను ఆ కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని, గట్టు అభివృద్ధికి రూ.కోటి కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం గట్టు మండలంలోని మహిళా సంఘాల సభ్యులకు 7.25 కోట్ల రుణాలకు సంబందించిన చెక్కును అందజేశారు. సెర్ప్ డైరెక్టర్ జమున, మార్కెట్ కమిటి చైర్మన్ హనుమంతు, నాయకులు జంబురామన్‌గౌడు, గట్టు తిమ్మప్ప, బండారి భాస్కర్, విజయ్‌కుమార్, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ చెన్నయ్య, ఏపీఎం జయాకర్, తదితరులు పాల్గొన్నారు.