గద్వాల: లైసెన్స్‌డ్ సర్వేయర్లు బాధ్యతగా పనిచేయాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో లైసెన్స్‌డ్ సర్వేయర్లకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వంటి ప్రక్రియలో సర్వే మ్యాప్‌లు తప్పనిసరిగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో లైసెన్స్‌డ్ సర్వేయర్ల ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతుందన్నారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పనిలో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియలో థియరీ ఎంతో ముఖ్యమో ప్రాక్టికల్ కూడా అంతే ముఖ్యమన్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు పరీక్ష అనంతరం లైసెన్స్‌డ్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాంచందర్, చందర్ పాల్గొన్నారు.
ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోండి
గద్వాల: జిల్లాలో కొరియర్, హోంసర్వీస్, ఫుడ్ డెలివరీ, ఏసీ టెక్నీషియన్లు, డిజైనర్స్, వీడియో ఎడిటర్లు వంటి విధులు నిర్వర్తించే కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుని గుర్తింపు కార్డులు పొందాలని కార్మికశాఖ ఏసీ మహేశ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెజాన్, ఫ్లిప్‌కార్డు, జొమాటో, స్విగ్గి వంటి సంస్థల్లో పనిచేసే వారిని కార్మికులుగా ప్రభుత్వం గుర్తించి.. వివిధ సంక్షేమ పథకాలు వర్తింపచేస్తుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 14434 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఉపాధ్యాయులకు శిక్షణ
అలంపూర్: అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు, రాజోళి, వడ్డేపల్లి, ఇటిక్యాల మండలాల్లోని స్కూల్ అసిస్టెంట్స్ శిక్షణ తరగతుల్లో పాల్గొనగా.. జిల్లా రీసోర్స్‌పర్సన్లు వెంకటేశ్, రాఘవేంద్ర పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు సులభ పద్ధతుల్లో బోధించాలని సూచించారు. శిక్షణ తరగతులను రాష్ట్ర రీసోర్స్‌పర్సన్లు గీత, వాణి పరిశీలించారు. నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ శివప్రసాద్, ఇన్‌చార్జి హేమలత తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఆదుకోవాలి
గద్వాల: అకాల వర్షాలకు ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ బీఎం సంతోష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రామాంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతా వరణంలో తేమశాతం ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యంలో తేమశాతం రావడం కష్టతరమన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పండించిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. అదే విధంగా పొగాకును సంబంధిత కంపెనీలు కొనుగోలు చేయకుండా.. ధరలు, తూకం విషయాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. రైతులతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకా రం పొగాకు కొనుగోలు చేయించాలన్నారు. కార్యక్రమంలో రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, బలిగెర శివారెడ్డి, దేవాదాసు, రవికుమార్ పాల్గొన్నారు.
రామన్‌పాడుకు నీటి సరఫరా నిలిపివేత
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం సముద్రమట్టానికి పైన 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల జలాశయం ఎడమ, కుడి కాల్వల ద్వారా నీటి సరఫరా లేదని.. రామన్‌పాడు జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నామని వివరించారు.

బాధ్యతగా పనిచేయాలి

బాధ్యతగా పనిచేయాలి