
కేఎల్‌ఐ: మరో 1.50 లక్షల ఎకరాలకు..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2002లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబా బు శంకుస్థాపన చేసినా.. పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వలో అప్పటి సీఎం వైఎస్‌ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.2,990 కోట్లు కేటాయించారు. ఇందులో నాలుగు రిజర్వాయర్లు ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడి పల్లి నిర్మించారు. ఆ తర్వాత దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. వైఎస్ మరణానంతరం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాజెక్ట్‌కు తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 కోట్లు కేటాయించి పలు పనులు చేపట్టింది. మొదట ఈ ప్రాజెక్ట్ ద్వారా 2.30 లక్షల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం కాగా.. ఆ తర్వాత ఆయకట్టు 4.20 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇప్పటికీ చాలా పనులు పెండింగ్‌లో ఉండడంతో రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్‌కు రూ.900 కోట్లు కేటాయించగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టేలా కసరత్తు చేస్తున్నారు.