
పాలమూరుకు అందాలభామలు
ప్రపంచ సుందరీమణుల బృందం సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సుందరీమణుల బృందానికి స్వాగతం పలకడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. గురువారం ఎస్పీ డి.జానకితో కలిసి కలెక్టర్ పిల్లలమర్రిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే థీమ్‌తో ప్రభుత్వం అందాల భామలు.. ప్రాచీన ఆలయాలు పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, ఏఎస్పీ రాములు, డీఎఫ్‌ఓసత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
● 22 దేశాలకు చెందిన అందగత్తెల రాక
● అన్ని ఏర్పాట్లు చేసిన పర్యాటక శాఖ
● మూడు అంచెల భద్రతతో భారీ బందోబస్తు ఏర్పాటు
● 2 గంటల పాటు కొనసాగనున్న పర్యటన
పాలమూరు: ఏడున్నర శతాబ్దాల చరిత్ర ఉన్న పిల్లలమర్రిలో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు సందడి చేయనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారుల బృందం శుక్రవారం పాలమూరుకు రానుంది. వారి కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 22 దేశాలకు చెందిన విదేశీ అందగత్తెలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో సాయంత్రం 5 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకోనున్నారు. పిల్లలమర్రి ప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేశారు. మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్డును సుందరీకరించడంతో పాటు ఇరువైపుల విద్యుత్ స్తంభాలకు రంగులు వేశారు. తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య సుందరీమణుల బృందానికి స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు.
పటిష్ట భద్రత కల్పిస్తాం..
ప్రంపచ సుందరీమణుల పర్యటన సందర్భంగా పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి పిల్లలమర్రి వరకు ప్రత్యేక కాన్వాయ్ కొనసాగుతుంది. మూడు అంచెల భద్రతతో పోలీస్ బలగాలు విధుల్లో ఉంటాయి. పర్యాటకులు, ప్రజలు మన ప్రాంతానికి వచ్చే అతిథిలతో గౌరవంగా ఉండాలి. పోలీస్‌శాఖ నుంచి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం.
– డి.జానకి, ఎస్పీ, మహబూబ్‌నగర్
● మిస్‌వరల్డ్ పోటీదారుల బృందం మహబూబ్‌నగర్‌లో రెండు గంటల పాటు పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటారు. పది నిమిషాల పాటు విశ్రాంతి తర్వాత మొదట చారిత్రక కళాఖండాలు, శిల్పకళలను తిలకిస్తారు. ఆ తర్వాత పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే ఉన్న మ్యూజియాన్ని సందర్శిస్తారు. అనంతరం మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉన్న పిల్లలమర్రి మహావృక్షాన్ని తిలకిస్తారు. అక్కడే ఒక్కొక్క అందగత్తె ఒక్కొక్క మొక్కను నాటనున్నారు. అనంతరం తిరిగి వారు రాత్రి ఏడు గంటలకు రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
ఏర్పాట్లను
పరిశీలించిన కలెక్టర్
నేడు పిల్లలమర్రిని సందర్శించనున్న ప్రపంచసుందరి పోటీదారులు
వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు
మిస్ వరల్డ్–2025 పోటీదారుల పర్యటను సంబంధించి జిల్లా పోలీస్ శాఖ 1,008 మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. మూడు అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. మొదటి వరుసలో మహిళ పోలీస్ సిబ్బంది విత్ సఫారీలో ఉండగా, రెండో వరుసలో సివిల్ పోలీస్, మూడో వరుసలో ఏఆర్ పోలీస్ బలగాలను బందోబస్తు కోసం కేటాయించనున్నారు. వీరితో పాటు స్పెషల్ పార్టీ, రాష్ట్రస్థాయి నుంచి బలగాలు పహారా కాస్తాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్‌ల నుంచి పోలీస్ బలగాలను రప్పించారు. ఇద్దరు ఎస్పీలు, ఒక ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 50 మంది ఎస్‌ఐలు, 936 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు బందోబస్తులో ఉంటారు. బందోబస్తును మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ డి.జానకి పర్యవేక్షించనున్నారు.

పాలమూరుకు అందాలభామలు

పాలమూరుకు అందాలభామలు