
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
ఇటిక్యాల: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈమేరకు పైలెట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని, రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఇటిక్యాల మండలంలోని మునగాలలో నిర్వహించిన భూ భారతి సదస్సులో ఆయన పాల్గొని రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తూ.. పరిష్కారానికి అనువుగా ఉన్న సమస్యలపై ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత, భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టుగా ఇటిక్యాల మండలాన్ని ఎంపిక చేసి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వివరించారు. భూ రికార్డుల సవరణలు, విస్తీర్ణ మార్పులు, వారసత్వ సమస్యలు, భూమి స్వభావానికి సంబంధించిన లోపాలు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, సాదాబైనామాలు, సర్వే నెంబర్ గల్లంతు, పట్టాదారు పాస్‌బుక్‌జారీ కాకపోవడం వంటి అంశాలు పరిష్కరించబడతాయని తెలిపారు. ఈ సదస్సులో తహశీల్దార్లు వీరభద్రప్ప, నరేష్, డి టి నందిని, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘన స్వాగతం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా మీదుకు నారాయణపేట పర్యటన వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద కలెక్టర్ విజయేందిర మొక్కను అందజేసీ స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలమర్రి మహావృక్షం ఫొటోను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావు, ఆర్‌డీఓ నవీన్, అర్బన్ తహసీల్దార్ ఘన్సిరాం, డీటీ దేవేందర్, ఆర్‌ఐలు నర్సింగ్, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
నిర్వాసితులకు అండగా ఉంటాం
కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కొల్లాపూర్ మండలంలోని బోడబండ తండా, సున్నపుతండా, వడ్డెర గుడిసెలను కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి మంత్రి సందర్శించి.. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పనుల పురోగతిపై అధికారులతో ఆరా తీశారు. నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీరు వస్తుండటంతో సున్నపుతండా మునకకు గురయ్యే అవకాశం ఉందని.. ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో ఇళ్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో సర్వం కోల్పోయిన ప్రజలకు అన్నివి ధాలా అండగా ఉంటామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బోడబండ తండా, సున్నపు తండా, వడ్డెర గుడిసెల కు చెందిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ భన్సీలాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏకలవ్య పాఠశాలలో
ప్రవేశానికి అవకాశం
కందనూలు: తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్టియర్‌లో మిగిలిన సీట్ల భర్తీకి గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ అధికారి కె.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశానికి ఆసక్తిగల విద్యార్థులు tsemrs.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకొని.. బాలానగర్ కళాశాలలో ఈ నెల 26న నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 94156 06618, 98557 37578 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి