
భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలి
అయిజ: భారతమాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాలేదని సోమవారం మండలంలోని దేవబండ గ్రామం రైతులు భారతమాల రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడారు. నష్టపరిహారం కోసం రైతులు అనేకసార్లు ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. భారతమాల రోడ్డు నిర్మాణం కోసం 33 ఎకరాల భూసేకరణ చేశారని తెలిపారు. మెదటి విడతలో కొంతమంది రైతులకు మాత్రమే నష్టపరిహారం వచ్చిందని, మిగితా వారికి రాలేదని మండిపడ్డారు. బోర్‌వెల్స్, ఓపెన్ వెల్స్, చెట్లకు రావాల్సిన నరష్టపరిహారం ఇంతవరకు రాలేదని వాపోయారు. అందరికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇచ్చేవరకు నిరసన చేపడుతామని హెచ్చరించారు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ శ్రీనివాసరావు చేరుకొని సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని నచ్చచెప్పడంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.