
ఇందిరమ్మ ఇళ్ల పనులు పూర్తిచేయాలి
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పనుల లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతిని మండలాల వారీగా సమీక్షిస్తూ మంజురైనా ఇళ్ల నిర్మాణ పనుల్లో గ్రౌండింగ్, బేస్‌మెంట్, మార్క్ అవుట్, రీ వెరిఫికేషన్ తదితర అంశాలను అధికారుల నుంచి వివరంగా అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పునులు వేగవంతంగా పూర్తయ్యేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి వివరాలను ఎప్పటికప్పడు ఆన్‌లైన్ యాప్‌లో నమోదు చేస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎంపికలో ఆధార్, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు అన్ని అర్హత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసి కార్పొరేషన్ బ్యాంకుల వారీగా సంబంధిత బ్యాంకులకు పంపిచాలని, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు వాటిని పరిశీలించి అర్హత నివేదిక సమర్పించాలన్నారు. ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి అర్హత ఉన్న వారిని ఎంపిక చేయాలన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన రైతుల ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి ధాన్యం సేకరించి మిల్లులకు తరలించాలన్నారు. గాలి, దుమ్ము, అకాల వర్షాలు పడుతున్నందున వడ్లు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్‌బాబు, ఎల్డీఎం శ్రీనివాసరావు, పౌరసరఫరాల అధికారి స్వామికుమార్, డీఎం విమల, పీడీ శ్రీనివాసులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.