
నేటి నుంచి బీచుపల్లి బ్రహ్మోత్సవాలు
ఎర్రవల్లి: అపర మంత్రాలయంగా పేరుగాంచిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయన అర్చకులు తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఉదయం పంచామృతాభిషేకం, వాస్తుపూజ హోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణ, రాత్రికి తెప్పోత్సవం, ఆదివారం ఉదయం పంచామృతాభిషేకం, స్వామివారి ఉపనయనం, రాత్రికి ప్రభోత్సవం, సోమవారం ఉదయం పంచామృతాభిషేకం, వ్యాసపూజ, మధ్యాహ్నం సీతారాముల కల్యాణం, బలిహరణము, సాయంత్రం రథంగ హోమం, రాత్రికి కుంభం, రథోత్సవం, మంగళవారం ఉదయం పంచామృతాభిషేకం, చౌకిసేవ, బలిహరణం, రాత్రికి ప్రభోత్సవం, బుధవారం ఉదయం అమృతస్నానం, పంచామృభిషేకం, రాత్రికి పల్లకీసేవతో ఆంజనేయస్వామి ఉత్సవాలు ముగుస్తాయి.
ఆలయంలో నిత్య పూజలు
ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రతి రోజు ఉదయం 07:30 లకు ఆకుపూజ, అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల సమయంలో నాలుగు శనివారాల్లో కూడా భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పిస్తారు. ఆలయ సమీపంలో దక్షిణవాహినిగా పేరుగాంచిన పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాతే భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తారు. ప్రతి అమావాస్య రోజు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపడతారు.
ఐదు రోజుల పాటు వేడుకలు
12న ఆంజనేయస్వామివారి రథోత్సవం
వేలాది తరలిన రానున్న భక్తులు
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఆంజనేయస్వామి ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించినట్లు ఆలయ ఈఓ రామన్‌గౌడ్ తెలిపారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు.

నేటి నుంచి బీచుపల్లి బ్రహ్మోత్సవాలు