పుర ఆదాయానికి గండి | - | Sakshi
Sakshi News home page

పుర ఆదాయానికి గండి

May 8 2025 9:08 AM | Updated on May 8 2025 9:08 AM

పుర ఆ

పుర ఆదాయానికి గండి

వ్యాపార సముదాయాలపై కొరవడిన పర్యవేక్షణ

వసూలు చేస్తాం

మున్సిపాలిటీకి సంబందించిన దుకాణాల అద్దె బకాయిలను వసూలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడతాం. ఇప్పటికే బకాయిలు ఎక్కువగా ఉన్న దుకాణాల తాలుకు జాబితా తయారు చేశాం. వారందరికి నోటీసులు జారీ చేస్తున్నాం. అప్పటికీ స్పందించకుంటే దుకాణాలకు తాళాలు వేస్తాం. దుకాణాల అద్దె విషయంలో కఠిన చర్యలు తప్పవు.

– దశరథ్‌ మున్సిపల్‌ కమిషనర్‌, గద్వాల

గద్వాలటౌన్‌: ‘స్థలం మనది.. ఇల్లు కట్టుకునేది మన సొమ్ములతో.. కానీ ఇంటి స్థలానికి లేఅవుట్‌ అనుమతి ఉండాలి. ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకోవాలి. కనీసం లేఅవుట్‌ లేకపోయినా భూమి మార్కెట్‌ ధరపై 14 శాతం అపరాధ రుసుం వసూలు చేస్తారు. అనుమతి లేకుండా ఇల్లు కట్టుకుంటే ఆస్తిపన్ను రెట్టింపు విధిస్తారు. అన్నీ అనుమతులు తీసుకొని ఇల్లు కట్టుకున్నా ఏటా ఆస్తిపన్ను చెల్లించాలి. ఇది మన సొంత ఆస్తికి సంబంధించిన వ్యవహరం.’

‘భూమి మనదే... పూరి గుడిసె అయినా.. మేడలైనా మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఆస్తిపన్ను చెల్లించాలి. మదింపు చేసి విధించిన ఆస్తిపన్నును ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశిత తేదీల్లో చెల్లించని పక్షంలో రూ.100కు రూ.2 చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. మన సొంత ఆస్తులకు సైతం ఏటా పన్ను చెల్లించాలన్న మాట.’..

కానీ ఇవేవీ లేకుండా దర్జాగా ఆస్తులను అనుభవించాలనుకుంటే మాత్రం మున్సిపాలిటీలకు చెందిన ఆస్తులు (వ్యాపార సముదాయాలను) వెతుక్కోవాలి. ఒక్కసారి వేలంలో పాల్గొని సముదాయంలో ఒక్క దుకాణం పొందితే చాలు మొదట కొంత సొమ్ము విదిల్చుకుంటే ఇక ఆ ఆస్తిని అనుభవించడానికి హక్కులు పొందినట్లే. అద్దెలు అడిగేవారుండరు.. అడిగినా మనకు తెలిసిన నాయకులను ఆశ్రయిస్తే సరిపోతుంది. గద్వాల మున్సిపాలిటీలోని వ్యాపార సముదాయాల్లో జరుగుతున్న తంతు ఇది. మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే మనరులుగా లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వ్యాపార సముదాయాలు పరులపాలవుతున్నాయి. మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతుండగా, దుకాణాలను పొందిన వ్యక్తులు వాటిని ఇతరులకు అద్దెకిస్తూ ఆర్జిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపార సముదాయాల్లో నిబంధన ఉల్లంఘన అడుగడుగునా చోటుచేసుకుంటున్న విషయం అధికారులకు తెలిసినా నోరు మెదపడం కానీ.. అద్దె వసూలు చేయాలనే సాహసంతో ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. రాజకీయ జోక్యం సొంత ఆస్తులపై రాబడిని ఆర్జించలేని స్థితిని మున్సిపాలిటీకి కల్పిస్తుంది.

పేరుకుపోతున్న బకాయిలు

పాత బస్టాండ్‌ సముదాయంలో, పాత గ్రంథాలయ భవన నిర్మాణం కింద దుకాణాలను వేలం పాట ద్వారా అద్దెలకు ఇచ్చారు. భారీ మొత్తంలో వ్యాపారులు వేలం పాడి దుకాణాలను దక్కించుకున్నారు. ఇందులో చాలా మంది వ్యాపారులు దుకాణం దక్కించుకున్నప్పటి నుంచి అద్దెలే చెల్లించడం లేదు. ఈ రెండు సముదాయాలలో ఉన్న అద్దె బకాయిలే రూ.లక్షల్లో ఉన్నాయి. కొంత మంది రెండు, మూడేళ్ల నుంచి అద్దెలు చెల్లించడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్దె వసూళ్లకు వెళ్లిన మున్సిపల్‌ సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పెద్ద మొత్తంలో అద్దె బకాయిలు పేరుకపోతున్నాయి. కొన్ని దుకాణాలకు న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయి. వాటి పరిష్కారానికి అధికారులు కనీస శ్రద్ధ కనబర్చడం లేదు.

రెండు, మూడేళ్లుగా అద్దెలు

చెల్లించని వైనం

పేరుకుపోయిన రూ.1.50 కోట్ల

అద్దె బకాయిలు

బయటి మార్కెట్‌ కంటే తక్కువ

అద్దెలతో మున్సిపాలిటీకి నష్టం

ఇదీ పరిస్థితి..

జిల్లాలో గద్వాలతో పాటు అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే మూడు దశాబ్దాల క్రితం ఐడీఎస్‌ఎంటీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ రుణంతో గద్వాల మున్సిపల్‌ పరిధిలో 236 దుకాణాలను చేపట్టారు. ఏ నుంచి హెచ్‌ బ్లాక్‌ వరకూ.. స్టోర్స్‌ అకాడమి, నల్లకుంట కాలనీ, కూరగాయల మార్కెట్‌ దగ్గర, పాత బస్టాండ్‌, మున్సిపల్‌ కార్యాలయం పక్కన, కళాశాల మార్గంలో ఉన్న ప్రధాన రహదారుల పక్కన దుకాణాలను నిర్మించారు. కొన్ని దుకాణ సముదాయాలకు 30 ఏళ్లు లీజు అగ్రిమెంట్‌ పూర్తయింది. కేటాయించిన దుకాణాల అద్దెలను ప్రతి మూడేళ్లకు రెన్యూవల్‌ చేయాలి. కానీ అద్దెలను మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు పెంచకుండా తక్కువ మొత్తంలో అద్దెలు చెల్లిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో దుకాణాల అద్దె బకాయి రూ.1.50 కోట్లకు చేరుకుంది.

పుర ఆదాయానికి గండి 1
1/1

పుర ఆదాయానికి గండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement