
పారా బాయిల్డ్‌లో భారీ అగ్నిప్రమాదం
వనపర్తి: పెబ్బేరు పట్టణ శివారులోని సాయిగోపాల్ పారా బాయిల్డ్ మిల్లులో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి–44కు సమీపంలోని మిల్లులో సాయంత్రం ఎవరూ లేని సమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి.. గన్నీ బ్యాగులు, ధాన్యం బస్తాలు, మర ఆడించిన బియ్యం పెద్దమొత్తంలో దహనమైనట్లు మిల్లు యజమాని తెలిపారు. మిల్లులో పనిచేసేవారు టీ తాగేందుకు బయటకు వెళ్లిన సమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగగా.. గమనించిన వారు వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడంతోపాటు కొత్తకోట అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రెండు వాహనాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్ర యత్నం చేసినా.. రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 కోట్లకుపైగా నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
పారా బాయిల్డ్ మిల్లులో చెలరేగుతున్న మంటలు
వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన