
రేపటి నుంచి డిగ్రీ కళాశాలలు బంద్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలలను సోమవారం నుంచి బంద్ చేస్తున్నట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో వైస్‌చాన్స్‌లర్‌తో జరిగిన సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని, దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. దీనికి తోడు పీయూ అధికారులు సైతం కళాశాలల అఫ్లియేషన్స్, ర్యాటిఫికేషన్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చే వరకు సమయం ఇవ్వాలన్నా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఈ నెల 6న జరిగే డిగ్రీ పరీక్షలను సైతం నిర్వహించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జహీర్‌అక్తర్, ఫణిప్రసాద్, సత్యనారాయణగౌడ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.