
మానవుడి ఆయుష్షు పెంచడమే ఉగాది ఉద్దేశం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో జీవిస్తున్న మానవుడి ఆయుష్షు పెంచడమే పండగ ఉద్దేశం అని, షడ్రుచులను వివిధ ప్రకృతి ప్రసాదాలతో తయారు చేసిన వాటిని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆరోగ్యం పెరుగుతుందన్నారు. చేదు, తీపిలు జీవితంలో మంచి చెడులను ఆస్వాధించడమే అన్నారు. వక్త గుంత లక్ష్మణ్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడమే ముఖ్యమని, సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తోందన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోవద్దని సూచించారు. ప్రపంచ విపత్తులకు భారతదేశ యువత మార్గాలను చూపాలని, చెడు వ్యసనాలకు బానిసై నిర్వీర్యం కాకుండా, తన కుటుంబంతో పాటు దేశసేవలో భాగం కావాలని, వసుదైక ఉమ్మడి కుటుంబ విలువను పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు కవితలు, జానపద గేయాలు, జానపద నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ రాజ్‌కుమార్, తెలుగు డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ సంధ్యరాణి, ప్రిన్సిపాళ్లు రవికాంత్, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.