
గద్వాల రూరల్: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నిర్ణయం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వాటి లెక్క పూర్తయితేనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టనున్నారు. ఇందుకోసం రక్షణ బాధ్యతలు కల్పించడానికి జిల్లా పోలీస్‌శాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లు లెక్కించనుండగా.. కేంద్ర బలగాలు, టీఎస్‌ఎస్‌పీ, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. కేంద్రంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది గుర్తింపు కార్డు ఉన్న వారితోపాటు ప్రత్యేక పాస్ కలిగిన వారికి మాత్రమే అనుమతిస్తారు. లెక్కింపు కేంద్రం పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది.
గుర్తింపు కార్డులు ఉంటేనే..
గోనుపాడులోని కళాశాలలో నిర్వహించే అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రత కల్పిస్తోంది. ప్రధానంగా మూడంచెల భద్రత విధానం అమలు చేయడం వల్ల పటిష్ట నిఘా ఉంటుంది. మొదటి వరుసలో కేంద్ర బలగాలు, రెండో వరుసలో టీఎస్‌ఎస్‌పీ సిబ్బంది, ఇక మూడో అంచెలో సివిల్ పోలీసులను నియమించారు. దీంతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం నియామకం చేసిన ఉద్యోగులు, సిబ్బందికి ఇప్పటికే గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఐటీబీపీ బలగాలు ఉదయం వారిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
గద్వాల క్రైం: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కావడంతో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ రితిరాజ్ అన్నారు. ఆదివారం గద్వాల, అలంపూర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు గోనుపాడు గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సంబంధించిన కార్యకార్తలు, నాయకులు ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు పోలీసుశాఖకు సహకరించాలన్నారు.
గుర్తింపు కార్డు ఉన్న వారికే
కేంద్రంలోకి అనుమతి
పరిసర ప్రాంతాల్లో 30 పోలీస్ చట్టం, 144 సెక్షన్ అమలు
లోపలికి వెళ్లేవారు సెల్‌ఫోన్, వాటర్ బాటిల్స్, అగ్గిపెట్టెలు తీసుకెళ్లడం నిషేధం
ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయింపు