
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్‌గౌడ్
గద్వాల: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, సీఎం కేసీఆర్ సాగిస్తున్న అబద్దపు, మోసపూరిత పాలనను గద్దె దించే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ళ వీరేందర్‌గౌడ్ అన్నారు. బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శక్తికేంద్ర వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు అహంకారం పెరిగిందని, ప్రజలంటే లెక్కలేకుండా పోయిందన్నారు. దేశంలోనే రూ.5 లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రంగా తెలంగాణను మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు తెలియకుండా ఖర్చు చేయడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అన్నారు. ఎవరూ నమ్మని వ్యక్తి కేసీఆర్‌ను.. తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయారని చెప్పారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌తో ప్రజలు విసిగిపోయారని, ఈసారి కేసీఆర్ పిట్టకథలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రతి బూత్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి బీఆర్‌ఎస్ అవినీతిని ప్రజలకు వివరించి చైతన్యపరచాలన్నారు. బీజేపీతోనే దేశంలో సుస్థిర పాలన అందుతుందని, ప్రధాని మోదీ ఎనిమిదిన్నర ఏళ్ల పాలనలో పలు సంక్షేమ పథకాలు అమలు చేసి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామంజనేయులు, పార్టీ నాయకులు గడ్డం కృష్ణరెడ్డి, ఎంఎస్‌రెడ్డి, కృష్ణవేణి, శ్యామ్, జయశ్రీ, అనిత తదితరులు పాల్గొన్నారు.