ఆవిర్భావ దినోత్సవం రద్దు అన్యాయం
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో నిధుల కొరత నెపంతో ఈ నెల 23న ఏరియా స్థాయిలో జరగాల్సిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని యాజమాన్యం రద్దుచేయడం అన్యాయమని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్) బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వేలబోయిన సుజేందర్ తీవ్రంగా ఖండించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వేడుకలు నిర్వహించేందుకు తక్కువ బడ్జెట్ మంజూరు చేసిందన్నారు. దీనిపై కార్మికులు చాలా ఆగ్రహంగా ఉన్నారని.. కార్మికులు కష్టపడి లాభాలు తెస్తుంటే, తమ పండుగ లాంటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని జరపకుండా నిధుల కోత విధించడం సరైనది కాదన్నారు. రాజకీయ నాయకుల మెప్పుల కోసం సింగరేణి నిధులను దుబారా చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. పెద్ద మొత్తంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను నిధుల కొరతతో ఎలా నిర్వహిస్తారో వేచి చూడాలన్నారు. సింగరేణి యాజమాన్యం, కార్మికుల శ్రేయస్సు కోసం వెచ్చించాల్సిన నిధులను ప్రభుత్వ అవసరాలకు, మంత్రుల మెప్పుకోసం, ఫుట్‌బాల్ ఆటల కోసం వెచ్చిస్తుందన్నారు. సింగరేణి కార్మికుల ఆత్మగౌరవ పండుగలాంటి ఆవిర్భావ దినోత్సవాన్ని నిధుల కొరతతో నిర్వహించలేమని చెప్పడం సింగరేణి అస్తిత్వానికి ఆటంకంగా ఉందని యాజమాన్య వైఖరి విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధి, నూతన బొగ్గు గనుల, భూనిర్వాసిత ప్రాంతాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన సింగరేణి నిధులను యాజమాన్యం తన ఇష్టానుసారంగా మళ్లించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి యాజమాన్యం వెంటనే సింగరేణి ఆవిర్భావ వేడుకలను గతంలో మాదిరిగా ఘనంగా నిర్వహించడం కోసం తగినన్ని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి నుంచి యాజమాన్యం సింగరేణి నిధులను దుబారా చేయడం మానుకొని, కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి, పారిశ్రామిక సంబంధాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రాసకట్ల నర్సింగరావు, పాండ్రాల మల్లయ్య, కడారి శంకర్, నారాయణ, శీలం రాజు, ఓరం లక్ష్మణ్, అల్లం శ్రీనివాస్, భాస్కర్, శ్రీరాములు, రాజు, సాగర్, కొత్తూరు మల్లేష్ పాల్గొన్నారు.


