ఉపాధిని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర
భూపాలపల్లి రూరల్: పేదల ఉపాధిని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతధంగా కొనసాగించాలని, పథకాల నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సుభాష్‌కాలనీలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నాలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఉపాధిని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఉపాధిహమీ పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. గాంధీ పేరును తొలగించి ఆయన ప్రతిష్ఠను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
గాంధీ విగ్రహం ఎదుట ధర్నా


