నైతిక విలువలు పాటించాలి
భూపాలపల్లి అర్బన్: నైతిక విలువలు పాటించి రాజీమార్గంలో సాగాలని, వివాదాలకు తావులేని జీవితాలను గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో ఆదివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సోదరాభావంతో కలిసి మెలిసి జీవించినప్పుడు వివాదాలు తలెత్తవని, ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. పంతాలకు పోయి కేసుల పాలై పోలీస్‌స్టేషన్ల, కోర్టుల చుట్టూ తిరిగితే నష్టమే తప్ప లాభం ఉండదని, మనశ్శాంతి, డబ్బు, సమయాన్ని కోల్పోవలసి వస్తుందని అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగే లోక్ అదాలత్‌లో కేసుల్లోని ఇరువర్గాల వారి అంగీకారంతో కేసులను కొట్టివేసినట్లు.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్, జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌ఆర్ దిలీప్‌కుమార్‌నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, డీఎస్పీ సంపత్‌రావు, బార్ అసోసియేషన్ సభ్యులు మహేందర్, శ్రవణ్‌రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్, సీఐ నరేష్, ఎస్‌ఐలు సాంబమూర్తి, సుధాకర్, న్యాయవాదులు, కాక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
రాజీమార్గంలో పయనించి కేసులు పరిష్కారం చేసుకోవాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేశ్‌బాబు


