నామమాత్రంగానే.. | - | Sakshi
Sakshi News home page

నామమాత్రంగానే..

Dec 21 2025 9:29 AM | Updated on Dec 21 2025 9:29 AM

నామమా

నామమాత్రంగానే..

కాటారం: సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచే దిశగా సాంకేతిక పద్ధతిలో విద్యను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారిత డిజిటల్‌ బోధన పూర్తిస్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం గొప్ప ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన డిజిటల్‌ బోధనకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన ఇన్ఫాస్ట్రక్చర్‌ లేకపోవడంతో ఏఐ బోధన అమలు కష్టతరంగా మారింది. ఏఐ బోధనకు ప్రత్యేకంగా ల్యాబ్‌తో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉండాల్సి ఉంటుంది. పాఠశాలల్లో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు నామమాత్రంగా డిజిటల్‌ బోధనను ముందుకుసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఏఐ బోధన అమలుకు నోచుకోవడం లేదు.

అందుబాటులో లేని సౌకర్యాలు..

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏఐ ద్వారా విద్యాబోధన చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటగా జిల్లాలోని ఆరు పాఠశాలలను పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేశారు. ఇందులో భూపాలపల్లి మండలం గుర్రంపేట, కమలాపూర్‌, కాటారం మండలం చింతకాని, దేవరాంపల్లి, మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లి, టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో వసతులు లేకపోవడంతో ఏఐ తరగతుల నిర్వహణ కష్టతరంగా మారింది. డిజిటల్‌ ఆధారిత బోధనలో కంప్యూటర్లు కీలకం అయినప్పటికీ ఏ పాఠశాలలోనూ కంప్యూటర్లు అమర్చలేదు. ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటు జరగలేదు. దీంతో సమీపంలోని హైస్కూల్‌లో కంప్యూటర్‌లను వినియోగిస్తూ విద్యార్థులకు ఏఐ బోధన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటర్నెట్‌ సౌకర్యం సైతం లేకపోవడంతో ఉపాధ్యాయుల వద్ద ఉన్న మోబైల్స్‌ ద్వారా ఇంటర్నెట్‌ ఉపయోగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోవడంతో ఏఐ బోధన అంతంత మాత్రంగానే కొనసాగుతున్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు.

అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యంగా..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ బోధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కృతిమ మేథస్సు (ఏఐ) విద్యా బోధన పద్ధతిని ప్రవేశపెట్టింది. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఈ విధానం ద్వారా బోధన చేపట్టాల్సి ఉంటుంది. ఈ మూడు తరగతుల నుంచి పది మంది విద్యార్థులను ఎంపిక చేసి వారానికి రెండు రోజుల పాటు తెలుగు, మరో రెండు రోజుల పాటు గణితం బోధించాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విద్యాబోధన చేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధించాలి. విద్యార్థి పాఠాలను అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది ఏఐ గుర్తిస్తుంది. విద్యార్థికి పాఠ్యాంశాలు అర్థం కానట్లయితే సరళమైన మార్గంలో ఏఐ బోధన చేస్తుంది. ఇలా ప్రతీ విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను లెక్కకట్టనుంది. అనంతరం విద్యార్థులపై నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలన్నది ఏఐ విద్యాబోధన ముఖ్య ఉద్దేశం.

ఏఐ బోధన సక్రమంగా జరిగేలా..

జిల్లాలోని ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. పలు పాఠశాలల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – రాజేందర్‌, డీఈఓ

ముందుకుసాగని ఏఐ బోధన

పూర్తిస్థాయిలో అందుబాటులో లేని మౌలిక వసతులు

హైస్కూల్‌కు సంబంధించిన

కంప్యూటర్లతో ల్యాబ్‌ నిర్వహణ

ఇంటర్నెట్‌ సౌకర్యం లేక ఇబ్బందులు

జిల్లాలో ఆరు పాఠశాలల్లో నిర్వహణ

ప్రాథమిక పాఠశాలలు 317

ప్రాథమికోన్నత పాఠశాలలు 44

ఉన్నత పాఠశాలలు 69

విద్యార్థుల సంఖ్య 19,788

మరో 30 పాఠశాలల ప్రతిపాదన..

జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆరు పాఠశాలలతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు కలిగిన మరో 30 పాఠశాలల్లో ఏఐ బోధన అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రతిపాదిత పాఠశాలల్లో సైతం ఇన్ఫాస్ట్రక్చర్‌ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పన అనంతరం ఏఐ బోధన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది.

నామమాత్రంగానే.. 1
1/1

నామమాత్రంగానే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement