ప్రమాదాల నివారణకు ప్రణాళికలు
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి అర్బన్: రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పోలీస్, రవాణా, ఆర్టీసీ, వైద్య, విద్యా, సంక్షేమ శాఖలు, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖల అధికారులతో నిర్వహించిన రహదారి భద్రత జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న రహదారి ప్రమాదాలపై సమీక్ష నిర్వహించి, ప్రమాదాలకు కారణాలు గుర్తించి వాటి నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి అవసరమైన ఇంజనీరింగ్ మార్పులు చేపట్టాలని, వేగ నియంత్రణ, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రహదారి భద్రతా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సూచించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పోటీలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో గుర్తించిన 10 బ్లాక్ స్పాట్లను పోలీస్, రవాణా, రహదారుల అధికారులు పరిశీలించి ఇంటర్ వెన్షన్స్ తయారు చేయాలని సూచించారు. రహదారులపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2026 జనవరిలో చేపట్టనున్న రహదారి భద్రతా మాసోత్సవాల నిర్వహణకు శాఖల వారీగా కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏఎస్పీ నరేష్‌కుమార్, ఆర్టీఓ సంధాని, ఆర్టీసీ డీఎం ఇందు, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డీఈఓ రాజేందర్, జాతీయ రహదారుల డీఈ కిరణ్, ఐఆర్డీ డీఆర్‌ఎం లక్ష్మణ్, అన్ని శాఖల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు
రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నియంత్రించడమే లక్ష్యంగా జనవరి మాసంలో నిర్వహించనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై శనివారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, శాంతి భద్రతల ఏడీజీ మహేష్ భగవత్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మోరంచపల్లిలో మాక్‌డ్రిల్
వరదలు, పారిశ్రామిక ప్రమాదాలపై ఈ నెల 22న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని మోరంచపల్లిలో నిర్వహించనున్న మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ప్రకటనలో తెలిపారు. మాక్‌డ్రిల్‌లో వరదల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలు, పారిశ్రామిక ప్రమాదాల సమయంలో సహాయక చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించే విధానాలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, ఆరోగ్య, మున్సిపల్, పరిశ్రమల శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొనాలని ఆదేశించారు.


