నవగ్రహాల వద్ద శనిపూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన నవగ్రహాల వద్ద భక్తులు సామూహికంగా శనిపూజలు నిర్వహించారు. శనివారం ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం నవగ్రహాల వద్ద పూజలు చేసిన అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తజనం సందడి నెలకొంది.
లారీల అడ్డగింత
మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ లారీలను డేంజర్ జోన్ నిర్వాసితులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. డేంజర్ జోన్ ఎస్సీ కాలనీ ఇంటి సమీపంలో ఓపెన్ కాస్ట్ మట్టి పోస్తుండటంతో వాటి నుంచి వచ్చే దుమ్ము, ధూళితో అనారోగ్యాల బారిన పడుతున్నామని అన్నారు. రెండు రోజుల్లో అధికారులతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని మైన్ వైస్ ప్రెసిడెంట్ కేఎస్‌ఎన్ మూర్తి హామీ ఇచ్చారు.
నేడు జాతీయ
లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: నేడు(ఆదివారం) జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్‌బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీమార్గంలో కేసులను తొలగించుకునేందుకు లోక్ అదాలత్ చక్కటి అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీసులు, న్యాయవాదులు సహకరించి క్షక్షిదారులు అఽధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కృషి చేయాలని సూచించారు.
ధనుర్మాసం ప్రత్యేక పూజలు
గణపురం: మండలకేంద్రంలోని శ్రీపట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహించే ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 5వ రోజు శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ పట్టాభి సీతారామచంద్ర భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత ఆలయంలో ప్రతీ సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ తెలిపారు. అందులో భాగంగా స్వామి వారిన ప్రత్యేకంగా అలంకరించినట్లు చెప్పారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవాలన్నారు.
చెక్ డ్యాం పరిశీలన
మల్హర్: జిల్లా సరిహద్దులోని వల్లెకుంట–పెద్దపల్లి జిల్లా మంథని అడవి సోమన్‌పల్లి మానేరుపై నిర్మించిన డ్యామేజ్ అయిన చెక్‌డ్యాంను స్టేట్ ఫొరెన్సిక్ టీమ్, క్లూస్ టీం సభ్యులు శనివారం పరిశీలించారు. ఈనెల 17న చెక్ డ్యాం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు కొయ్యూరు స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టగా శనివారం ఈ ఘటనపై చెక్ డ్యాం డ్యామేజీ అయిన ప్రదేశాన్ని ఫొరెన్సిక్, క్లూస్ టీం సభ్యులు చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించి నమూనాలు సేకరించారు. సదరు నివేదిక ఆధారంగా చెక్ డ్యాం కూలిపోయిందా.. కూల్చేశారో తెలియనుంది. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కొయ్యూరు ఎస్సై నరేశ్, ఎస్సై–2 రజన్‌కుమార్, మహదేవపూర్ ఎస్సై పవన్ ఉన్నారు.
నవగ్రహాల వద్ద శనిపూజలు
నవగ్రహాల వద్ద శనిపూజలు
నవగ్రహాల వద్ద శనిపూజలు


