రూ.203 కోట్ల నిధులు మంజూరు
కాటారం: మంథని నియోజకవర్గంలోని మంథని–ఆరెంద మానేరు మీదుగా దామెరకుంట వరకు హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.203 కోట్ల నిధులు విడుదలైనట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని మండలం ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1.120 కిలోమీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ నుంచి బ్రిడ్జి వరకు మరో వైపు దామెరకుంట రోడ్డు వరకు 9.530 కిలో మీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మంథనితో పాటు ఇతర మండలాల ప్రజలు మానేరు బ్రిడ్జి దాటి ఇతర జిల్లాకు, మహారాష్ట్ర, కాళేశ్వరం దేవాలయానికి ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి వీలుగా ప్రజలకు రవాణా భారం తగ్గించేందుకు బ్రిడ్జి నిర్మాణానికి సంకల్పించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం ద్వారా మంథని, పెద్దపల్లి జిల్లా నుంచి కాళేశ్వరం వెళ్లడానికి 25 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. మానేరుపై బ్రిడ్జి నిర్మాణం పట్ల ఈ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తంచేయడంతో పాటు మంత్రి శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.


