
నేడు దీపావళి
రేపు కేదారేశ్వర నోములు ●
పండుగకు ముస్తాబైన గ్రామాలు ●
భూపాలపల్లి అర్బన్: జిల్లావ్యాప్తంగా నేడు (సోమవారం) ఉదయం దీపావళి, బోగి పండుగ హారతులు నిర్వహించి రేపు (మంగళవారం) సాయంత్రం ధనలక్ష్మి పూజలు చేపట్టుకోనున్నారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మొదటి రోజున వ్రతాలు, నోములు చేసుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వెలుగుల పండుగ దీపావళి ధనలక్ష్మి పూజలు, కేదారేశ్వర నోముల కోసం సుదూర ప్రాంతాల్లోని కుటుంబ సభ్యులంతా సొంత ఊళ్లకు చేరుకున్నారు. పట్టణంతో పాటు పల్లె లోగిళ్లు బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా పండుగ శోభ సంతరించుకుంది.
అందాల ప్రమిదలు
దీపావళి పండుగలో మట్టి ప్రమిదలకు ఎంతో విశిష్టత ఉంది. దీపాల కాంతుల్లో గృహాలు, ఆలయాలు మరింత శోభను సంతరించుకుంటాయి. వివిధ ఆకృతుల్లో ఆకట్టుకునేలా తయారు చేసిన ప్రమిదలు అందుబాటులోకి వచ్చాయి. రాజస్థాన్, కేరళ, ఢిల్లీ ప్రాంతాల్లో తయారైన వాటితో పాటు స్థానికంగా తయారుచేసిన ప్రమిదలను విక్రయిస్తున్నారు. డజన్ల చొప్పున విక్రయాలు చేపడుతున్నారు.
బాణసంచాకు పెరిగిన ధరలు
గతేడాది కంటే ఈ ఏడాది మరింతగా ధరలు పుంజుకున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. చిచ్చుబుడ్డీలు రూ.30నుంచి రూ.800 వరకు, కాకర పువ్వొత్తుల బాక్స్ రూ.250 నుంచి రూ.600 వరకు, స్టార్స్ రూ.20, 30, 40 సైజుల ఆధారంగా విక్రయించారు. ఇతర ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా బాణసంచా తీసుకువచ్చేందుకు హోల్‌సెల్ వ్యాపారులకు సైతం భారీగా రవాణా, ఇతర చార్జీలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరలు గతేడాదితో పోల్చుకుంటే అధికమని వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదల ప్రభావం ప్రత్యక్షంగా వినియోగదారులపై పడటంతో కొద్దిమొత్తంలో బాణసంచా కొనుగోలు చేసి వెళ్తున్నారు.
వెలిసిన దుకాణాలు
నోముల సందర్భంగా జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో తాత్కాలిక దుకాణాలను వ్యాపారులు ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో మట్టి ప్రమిదలు, నోము దండలు, మట్టి బొమ్మలు, బంతిపూలు, పూజసామగ్రి దుకాణాలు ఏర్పాటు చేయగా వారాంతపు సంత స్థలంలో బాంబుల దుకాణాలను ఏర్పాటు చేశారు. పండుగకు ముందు నుంచే పట్టి ప్రమిదలు, బొమ్మలు, బంతి పూలు బాణసంచాలు కొనుగోలు చేస్తున్నారు.

నేడు దీపావళి