
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
భూపాలపల్లి: జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పెద్దల పర్యవేక్షణలో ఉండాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ దీపావళి ప్రతీ ఇంటా వెలుగులు నింపాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
‘ఏఐటీయూసీ వైఫల్యాలతో అన్యాయం’
భూపాలపల్లి అర్బన్: మైనింగ్ స్టాఫ్‌కు కొంతకాలంగా జరుగుతున్న అన్యాయానికి కారణంగా ఏఐటీయూసీ గుర్తింపు సంఘం వైఫల్యమేనని టీబీజీకేఎస్ సెంట్రల్ జాయింట్ సెక్రటరీ రత్నం అవినాష్, మైనింగ్‌స్టాఫ్ ఇన్‌చార్జ్ చీకటి వంశీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘం మైనింగ్ స్టాఫ్ సమస్యల విషయంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తూ మేనేజ్‌మెంట్‌తో చర్చలు జరపకుండా టీబీజీకేఎస్‌పై విషప్రచారం చేస్తూ కాలం గడుపుతోందని ఆరోపించారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో జేఎంఈటీలకు ఓవర్‌మెన్ ప్రమోషన్లు ఆలస్యం లేకుండా ఇప్పించినట్లు తెలిపారు.
మొరం దందాను అరికట్టాలి
చిట్యాల: మండలంలోని శాంతినగర్‌లో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ శాంతినగర్ గుట్టలలో కొంతమంది నాయకులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని తెలిపారు. మట్టిని తరలించకుండా అధికారులు చూడాలని అన్నారు. ఆయన వెంట నాయకులు రాము, తదితరులు ఉన్నారు.
గంజాయి స్వాధీనం
కాటారం: గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకొని వారి దగ్గర నుంచి 1.57 కేజీల గంజాయిని ఆదివారం పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టంపేట గ్రామానికి చెందిన సుతారి శ్రీకాంత్, కమలాపూర్ గ్రామానికి చెందిన సోహెల్, మద్దులపల్లికి చెందిన మేకల అజయ్ కాటారం మండలంలోని పోతుల్వాయి బ్రిడ్జి వద్ద గంజాయి సేవిస్తున్నారు. అటువైపుగా వెళ్తున్న ఎస్సై శ్రీనివాస్ అనుమానంతో వారిని ప్రశ్నించగా అజయ్ పారిపోయాడు. శ్రీకాంత్, సోహెల్‌ను విచారించగా గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద 1.57 కేజీల గంజాయి గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. గంజాయితో పాటు ఒక మొబైల్ స్వాధీనపర్చుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీకాంత్, సోహెల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు.
టేకు దుంగల స్వాధీనం
ఏటూరునాగారం: ఏటూరునాగారం నుంచి వరంగల్ వైపు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను పట్టుకున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున మండల పరిధిలోని చిన్నబోయినపల్లి సమీపంలో జినాన్ పింక్ ఆప్ వాహనంలో తొమ్మిది టేకు దుంగలను పట్టుకెళ్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు ఆ వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేస్తుండగా డ్రైవర్ పరారయ్యాడు. వాహనంలో ఉన్న టేకు దుంగల విలువ రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఈ దుంగలను ఏటూరునాగారం రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ నారాయణ, ఎఫ్‌బీఓ ఖాజామొద్దిన్, జ్యోతి, అనూష, బేస్ క్యాంప్ సిబ్బంది సాంబ, ప్రశాంత్, మహేశ్, నాగేంద్ర, డ్రైవర్ హరీశ్ పాల్గొన్నారు.
ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి
ములుగు రూరల్: కల్లుగీత కార్మికులు హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆదివారం కల్లుగీత కార్మిక సంఘం 68వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జెండాలు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ హక్కుల సాధనకు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.