
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
మల్హర్: వానలు కురుస్తున్నాయి.. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ పది మందిలో నలుగురికి జలుబు, ఇద్దరికి జ్వరంతో కూడిన వైరల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైరల్ జ్వరాలు ఆకస్మాత్తుగా వచ్చి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 102 డిగ్రీల జ్వరం ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పుల మధ్య నిసత్తువగా మారిపోతారు. కొందరిలో ఒంటిపై దుద్దుర్లు, వాంతులు, అరుదుగా విరేచనాలూ కనిపిస్తాయి. మరికొందరిలో జలుబు వంటి లక్షణాలేవీ లేకుండానే జ్వరాలు వస్తాయి. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, వంటివీ వైరల్ ఫీవర్ కిందకే వస్తాయి.
వైరల్ ఫీవర్ రావడానికి కారణం..
వైరల్ ఫీవర్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు శ్వాస నాళాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు వైరల్ ఫీవర్ వస్తుంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా పాటించాలి.
ఆరోగ్యశాఖ అప్రమత్తం
సీజనల్ వ్యాధులు సోకకుండా మండల వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 29 వరకు మెడికల్ క్యాంపుల నిర్వహణకు శ్రీకారం చూట్టింది. దీంట్లో భాగంగా ఈనెల 3 నుంచి 11 (శుక్రవారం) వరకు రుద్రారం, తాడిచర్ల, కొయ్యూరు, అన్సాన్‌పల్లి, పెద్దతూండ్ల, మల్లారం గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. రోగులను పరీక్షించి, అవసరమైన రోగులకు ఉచితంగా మందులు అందించారు. సిజన్‌ల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సలహాలు, సూచనలను అందిస్తున్నారు.
– వినయ్ భాస్కర్, వైద్యాధికారి, మల్హర్
వాతావరణ మార్పులతో జ్వరాలు..
అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ
అప్రమత్తంగా ఉండాలి..
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జ్వరం వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. దోమ తెరలను వినియోగించాలి. పూల కుండీలు, ఎయిర్‌కూలర్లు, నీటి గొట్టాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేడి పదార్థాలను తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగితే మంచిది.

సీజనల్ వ్యాధులతో జాగ్రత్త