
బడిబాట పట్టించేలా..
పకడ్బందీగా ‘ఆపరేషన్ ముస్కాన్’
● మహిళా, శిశుసంక్షేమ, పోలీసు,
కార్మికశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు
● ఈనెల 31వరకు బాల కార్మికుల గుర్తింపు
● బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు
ప్రత్యేక బృందాలు..
మహిళా, శిశు సంక్షేమశాఖ (బాలల పరిరక్షణ విభాగం) (డీసీసీయూ), పోలీసు, కార్మిక, చైల్డ్ లైన్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. బడి మానేసి పనులు చేస్తున్న చిన్నారులను ఈ ప్రత్యేక బృందాలు గుర్తిస్తున్నాయి. పని ప్రదేశం నుంచి వారిని రక్షించడంతో పాటు బాలల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పనులను వదిలి బడిబాట పట్టేలా చర్యలు చేపడుతున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు తారసపడితే ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పించి వారి బాగోగులు చూసుకుంటున్నారు. గుర్తించిన వారిలో 14ఏళ్లలోపు పిల్లలు బాల కార్మికులుగా పనులు చేస్తుంటే బాధ్యులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బాల కార్మికుల వయస్సు ఆధారంగా వారి భవితకు దిశా నిర్దేశం చేస్తూ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
కాటారం: చిన్నారుల బాల్యం బందీ కాకుండా వెట్టిచాకి రి వైపు వెళ్లకుండా ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపడుతోంది. దీని ద్వారా బాలలు బడిబాట పట్టేలా అధికారులు కృషి చేస్తున్నారు. 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సుమారు 128మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా జనవరి 1 నుంచి 31వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1నుంచి 31వరకు ఆపరేషన్ ముస్కాన్‌ను పకడ్బందీగా నిర్వహిస్తూ బాల కార్మికులను గుర్తిస్తున్నారు.
నిరంతర పర్యవేక్షణ కరువు..
ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాల సమయంలో మాత్రమే సంబంధిత శాఖల అధికారులు గ్రామాల్లో బాల కార్మికులపై నిఘా పెడుతున్నారు. ఆ తర్వాత కనీస తనిఖీలు కూడా చేపట్టడం లేదు. ఏటా ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ పేరిట గుర్తించిన బాలల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడంతోనే సరిపెడుతున్నారు. ఆ తర్వాత వారు బడికి వెళ్తున్నారా లేదా అని సమీక్షించడం లేదు. ప్రత్యేక తనిఖీలతో సరిపెట్టకుండా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఉత్తమ ఫలితాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు.
ఐదేళ్లుగా తనిఖీల్లో గుర్తించిన పిల్లల వివరాలు
2021 28
2022 27
2023 29
2024 22
2025 22
మొత్తం 128

బడిబాట పట్టించేలా..