
మేడారం జాతర విశిష్టతను కాపాడుకోవాలి
● సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర విశిష్టతను కాపాడుకోవాలని సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్ అన్నారు. మండల పరిధిలోని ఐటీడీఏ అతిథి గృహంలో వనవాసీ కల్యాణ పరిషత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ సంస్కృతి పరిరక్షణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాటాల్డారు. మేడారం మహాజాతర ప్రకృతితో మమేకమై సాగుతుందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాకొద్ది జాతరను వారికి అనుగుణంగా మార్చుకుని అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. గద్దెల విశిష్టత తగ్గకుండా పనులు చేయాలన్నారు. మార్పుల విషయంలో స్థానిక పూజారుల, ఆదివాసీల అభిప్రాయాలు స్వీకరించాలన్నారు. అనంతరం సమ్మక్క జాతర పుస్తక రచయిత సూరయ్య మాట్లాడుతూ మేడారం జాతర ఎంతో పవిత్రమైందన్నారు. జాతర ఆసియా ఖండలోనే అతిపెద్ద గిరిజన జాతర కనుక అంతర్జాతీయ స్థాయిలో గిరిజన సంస్కృతి జాతర ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఆంగ్లంలో పుస్తకం తీసుకువచ్చామన్నారు. అనంతరం వనవాసీ సంఘ సభ్యులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఆదివాసీ గిరిజన సంస్కృతి ఎంతో గొప్పదన్నారు. జాతర పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. అనంతరం సమ్మక్క – సారలమ్మ జాతర విశిష్టతపై దుర్గం సూర్య రచించిన పుస్తకాన్ని వారు ఆవిష్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మ్యూజియం అసిస్టెంట్ క్యూరేటర్ కుర్సం రవికుమార్, వనవాసీ కల్యాణ పరిషత్ కార్యదర్శి మైపతి సంతోష్‌కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు హనుమంతరావు పాల్గొన్నారు.