సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: వచ్చే నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. భూపాలపల్లి ఏరియాలోని కొమురయ్య భవనంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్రిటిష్ కాలం నుంచి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తోందన్నారు. ఈనాలుగు కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ.. జూలై 9న బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సింగరేణిలో 2009లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో అగ్రిమెంట్ ప్రకారం మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికులకు సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు. పదేళ్లుగా టీబీజీకేఎస్ స్టక్చ్రర్ మీటింగ్‌లు నిర్వహించలేదని, ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలవడంతో అనేక సమస్యలను స్టక్చ్రర్ మీటింగ్‌లో యాజమాన్యానికి తెలిపినట్లు, అన్ని అంగీకరించినప్పటికీ ఇంకా సర్క్యూలర్ జారీ కాలేదని, సర్క్యూలర్ జారీ చేయాలని యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. గని ప్రమాదాల్లో చనిపోతే కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేయగా.. అందుకు అన్ని బ్యాంకుల్లో కోటి రూపాయల ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చినట్లు యాజమాన్యం చేసిందన్నారు. సమావేశంలో కేంద్ర, రాష్ట్ర కమిటీ నాయకులు అక్బర్ అలీ, ఎల్లయ్య, వీరభద్రం, వైవీరావు, సమ్మయ్య, మోటపలుకుల రమేశ్, మాతంగి రామచందర్, సుధాకర్‌రెడ్డి, చంద్రమౌళి, మల్లికార్జున్, నాగేంద్రబాబు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు
వాసిరెడ్డి సీతారామయ్య


