ఎరువులు, విత్తన దుకాణాలపై నిఘా
భూపాలపల్లి: నకిలీ ఎరువులు, విత్తనాల విక్రయాలు జరుగకుండా దుకాణాలపై నిఘా ఉంచాలని, లూజ్ విత్తన విక్రయాలు జరుగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, టీబీ ముక్త్ భారత్, వైద్య కళాశాలల నిర్వహణ, భూ భారతి, ఎరువులు, విత్తనాలు లభ్యత తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ఆయా శాఖల కార్యదర్శులతో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మ తన కార్యాలయంలో జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన 48,651 దరఖాస్తులు ఆన్‌లైన్ చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి ప్రతీ దరఖాస్తు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, ఆ విధంగా కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించి పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశించారు. టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా స్క్రీనింగ్ పెంచాలని, అనుమానితులకు ఎక్స్‌రే తీయాలన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, ఏఎస్పీ నరేష్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
రూ.136.94 కోట్లు జమ
భూపాలపల్లి రూరల్: రైతు భరోసా పథకం కింద మంగళవారం నాటికి జిల్లాలోని 1,14,718 మంది రైతుల ఖాతాల్లో రూ.136,93,80,755 కోట్లు జమ అయినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం కింద ఈ నిధులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సాయంతో రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలు తీర్చుకునేందుకు అవకాశం కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకావడం వల్ల పారదర్శకత సాధ్యమైందని చెప్పారు. వ్యవసాయానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ స్పష్టంచేశారు.


