
పీఆర్ రోడ్లకు మహర్దశ
సాక్షిప్రతినిధి, వరంగల్ :
● వరంగల్ జిల్లా గీసుకొండ నుంచి మొగిలిచర్ల ఎక్స్‌రోడ్డు వరకు రోడ్డు స్పెషల్ రిపేర్స్ కోసం రూ.1.57 కోట్లతో అంచనా వేశారు. రూ.1,22,93,509లకు ఆన్‌లైన్ టెండర్ పిలువగా ఈనెల 17న గడువు ముగుస్తుంది.
● హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం జెడ్పీ రోడ్డు నుంచి అలియాబాద్ ద్వారా కామారెడ్డిపల్లి వరకు రోడ్డు ప్రత్యేక మరమ్మతులకు రూ.2 కోట్లతో అంచనాలు పంపారు. ప్రభుత్వం రూ.158,09,702లకు పరిపాలన అనుమతి ఇవ్వగా ఆన్‌లైన్ టెండర్ ద్వారా ఈనెల 17 తర్వాత పనులు ఖరారు చేయనున్నారు.
● మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ నుంచి బేరువాడ పీఆర్ రోడ్డు (మంచతండా) వరకు కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.1,25,48,271లతో టెండర్లు పిలువగా, ఈనెల 15 వరకు ఆన్‌లైన్‌లో దాఖలుకు అవకాశం ఉంది.
.. ఇలా ఉమ్మడి వరంగల్‌లో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఐదు జిల్లాల్లో పాత రోడ్లకు స్పెషల్ రిపేర్స్, అత్యవసర మరమ్మతులు, మట్టి రోడ్లపై తారు వేయడంతో పాటు రోడ్డులేని గ్రామం లేకుండా కొత్తరోడ్లు నిర్మించేందుకు ఈ నిధులు మంజూరు చేసింది. మొదటి విడతగా హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో రూ.69.33 కోట్లతో 62 రోడ్లకు గత నెలాఖరులో నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు అర్హులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు పంచాయతీరాజ్ శాఖ వరంగల్ పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం నుంచి టెండర్లు పిలిచారు. ఈనెల 8 నుంచి 17 తేదీ వరకు టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చారు.
మానుకోటకు పెద్దపీట
గత వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు పలు ప్రాంతాల్లో మరమ్మతులకు నోచుకోకపోగా.. మళ్లీ వర్షాకాలం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులతో పాటు స్పిల్‌ఓవర్ పనులకు ఎమ్మెల్యేలు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపారు. 62 రోడ్లపై సుమారు రూ.75 కోట్ల మేరకు అవసరం ఉంటుందని ఎస్టిమేట్స్ రూపొందించగా, రూ.69.33 కోట్లు విడుదలయ్యాయి. హనుమకొండ జిల్లాలో 15 రోడ్లకు రూ.5.92 కోట్లు కేటాయించగా, ములుగు 11 రోడ్లకు రూ.17.10 కోట్లు, జయశంకర్ భూపాలపల్లికి ఐదు రోడ్లకు రూ.7.61 కోట్లు, వరంగల్ 10 రోడ్లకు రూ.9.20 కోట్లు కాగా, మహబూబాబాద్ జిల్లాలో 21 రోడ్లకు రూ.27.50 కోట్లు నిధులు మంజూరు చేశారు. మొత్తంగా విడుదలైన సుమారు రూ.69.33 కోట్లలో మానుకోటకు పెద్దపీట లభించింది.
స్పెషల్ రిపేర్స్, బీటీ, నిర్మాణాలకు పెద్దపీట
మరమ్మతులు, కొత్త రోడ్లపై తారుకు నిధులు
ఐదు జిల్లాల్లో 62 రోడ్లకు రూ.69.33 కోట్లు...
ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచిన
పంచాయతీరాజ్ శాఖ
ఈనెల 17తో ముగియనున్న ప్రక్రియ