
చిరు జల్లుల్లో తడుస్తూ.. స్టాళ్లను పరిశీలిస్తూ..
కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం చిరుజల్లుల్లోనే తడుస్తూ కాలినడకలో పరిశీలించారు. ఈ సందర్భంగా చిట్యాల మండలం జూకల్‌కు చెందిన మధు ఏర్పాటు చేసిన స్టాల్‌లో యంత్రం ద్వారా మొక్కజొన్న కంకులు కాల్చే, ఉడికించే విధానాన్ని పరిశీలించి రుచి చూసి బాగుందని ప్రశంసించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య కేంద్రాన్ని పరిశీలించి రోజువారీగా ఎంతమందికి వైద్య సేవలు అందిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించి పర్యావరణానికి హాని చేయని, భూమిలో కలిసిపోయే కవర్లను పరిశీలించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జిల్లా బాసులు స్టాళ్ల పరిశీలనకు రావడంతో అధికారులు కూడా వారి వెంట పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ నరేష్, ఆర్‌డబ్ల్యూస్ ఈఈ నిర్మల, తదితరులు పాల్గొన్నారు.