భూపాలపల్లి రూరల్: పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ రాజేందర్, జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు. భూపాలపల్లి మండలంలోని గొల్లబద్దారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. విద్యార్థులు కృషి, పట్టుదలతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. కలెక్టర్ సంతకం చేసిన ‘అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి‘ అనే ప్రేరణ కరపత్రాన్ని విద్యార్థులకు అందజేశారు. పరీక్షా ప్యాడ్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ రాజ్ గోపాల్, లక్ష్మీనారాయణ, తిరుపతి రెడ్డి, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: రాజీవ్ యువ వికాసం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రూ.4లక్షల వరకు ఆర్థిక సాయాన్ని 60 నుంచి 80 శాతం సబ్సిడీతో అందించనుంది. ఈమేరకు ఆసక్తి, అర్హతగల వారు ఆధార్, కులం, నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని, జిల్లా కలెక్టరేట్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటర్ పరీక్షలో
10 మంది విద్యార్థుల డీబార్
భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షికల్లో భాగంగా బుధవారం 10 మంది విద్యార్థులు డీబార్ అయినట్లు నోడల్ అధికారి వెంకన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్‌లో ఆరుగురు, తేజస్విని గాంధీ జూనియర్ కళాశాల సెంటర్‌లో నలుగురు విద్యార్థులను స్పెషల్ స్క్వాడ్ డీబార్ చేసినట్లు వెల్లడించారు.
కలెక్టరేట్ ఎదుట
ఆశ వర్కర్ల ఆందోళన
భూపాలపల్లి అర్బన్: వైద్యారోగ్యశాఖ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న తమకు కనీస వేతనాలు అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆశ కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఉదయం 8గంటలకే కలెక్టరేట్‌కు చేరుకోని ధర్నా, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బందు సాయిలు, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేతం విజయ, మెట్టుకొండ లక్ష్మి మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ప్రభుత్వం రూ.18,000 వేతనం నిర్ణయించాలని, పదోన్నతులు కల్పించి పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆకుదార రమేష్, రాజేందర్, ఆశాలు తిరుమల, రాధిక, రాజేశ్వర్‌రెడ్డి, రమ, సరిత, యాకూబ్, శారద పాల్గొన్నారు.
నేడు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాక
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీ నది పుష్కరాల అభివృద్ధి పనుల పరిశీలనకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ శ్రీధర్ గురువారం రానున్నారు. ఉదయం 10 గంటలకు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించనున్నారు. కాగా, అభివృద్ధి పనులకు రూ.25కోట్ల నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే.
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి