కాళేశ్వరం : దేవుడి సన్నిధిలో కోతులు, కుక్కలతో బాధ | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం : దేవుడి సన్నిధిలో కోతులు, కుక్కలతో బాధ

Sep 23 2023 1:26 AM | Updated on Sep 23 2023 4:15 PM

- - Sakshi

కాళేశ్వరం: నిత్యం వేల మందితో కిటకిటలాడే కాళేశ్వరాలయం పరిసరాలతో పాటు గ్రామంలో కుక్కలు, కోతులు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పలువురిని కరిచిన ఘటనలు ఉన్నాయి. అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని వి మర్శలు ఉన్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, పర్యాటకులు వస్తారు. మృతి చెందినవారి అస్థికలు కలిపేందుకు అత్యధికంగా కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా రు. ఈ క్రమంలో అస్థికలు కలిపేందుకు వచ్చిన వారు పిండ ప్రదాన పూజలు ముగిసిన అనంతరం గ్రామంతో పాటు అటవీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా మిగిలిన ఆహార పదార్థాలు, మాంసాహారం వ్యర్థాలను పడేస్తున్నారు. దీంతో కుక్కలు, కోతులు, పందులు ఆహార పదార్థాలు తినడానికి స్వైరవిహారం చేస్తున్నాయి. అటు అటవీశాఖ అధికారులు కూడా అటవీప్రాంతాల్లో తినేవారిని, వ్యర్ధాలను పడేయకుండా నివారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

పుష్కలంగా ఆహారం..

కాళేశ్వరం దర్శనానికి, అస్థికలు కలిపేందుకు వచ్చిన భక్తులు చికెన్‌, మటన్‌ వ్యర్థాలు పడేస్తున్నారు. తినగా మిగిలిన ఆహారం కూడా పడేస్తున్నారు. దీంతో అటవీ ప్రాంతాలు, గ్రామంతో పాటు ఆలయ పరిసరాలు, గోదావరి తీరాల వద్ద కుక్కలు, కోతులకు పుష్కలంగా ఆహారం లభిస్తుంది. దీంతో అవి గ్రామం అంతా కలియతిరుగుతున్నాయి. ప్రతి వార్డులో 30–40వరకు కుక్కలు దర్శనమిస్తున్నాయి. కోతులైతే అడవిలో ఆహారం లేక గ్రామంలో ఆహారం దొరకడంతో లెక్కలేనన్ని సంచరిస్తున్నాయి. భక్తులు, గ్రామస్తులు పడేసే వ్యర్థాలను తినేందుకు పందులు సైతం సంచరించడంతో సీజనల్‌ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ప్రధాన రహదారి చికెన్‌ సెంటర్ల వద్ద, ఆలయ పరిసరాలు, పలుగుల బైపాస్‌ రోడ్డు, మజీద్‌పల్లి, ఎస్సీకాలనీల వద్ద కుక్కలతో రాత్రి వేళల్లో జనం పరేషాన్‌ అవుతున్నారు. మాంసాహారాలు తినడంతో కొన్ని కుక్కలకు ఎర్రిలేచి నోటి నుంచి సొల్లుకారుతూ, శరీరంపై వెంట్రుకలు ఊడిపోయి దర్శనమిస్తున్నాయి. అవి జనంపైకి మొరుగుతున్నాయి. దీంతో చిన్నారులు ఒంటరిగా వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో 400లకుపైగా కుక్కలు, లెక్కలేనన్ని కోతులు, స్వల్ప సంఖ్యలో పందులు ఉన్నాయి. వీటిని నివారించడానికి అధికారులు సాహసం చేయడం లేదు.

పట్టించుకోని వైనం..

పంచాయతీ, దేవాదాయ, అటవీశాఖలు కోతులు, కుక్కలు, పందులు స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కనీసం గ్రామస్తులకు, భక్తులకు రక్షణ చర్యలు చేపట్టడం లేదని విమర్శలు ఉన్నాయి.

పరేషాన్‌!

‘మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ప్రాంతానికి చెందిన సురేందర్‌ ఇసుక క్వారీలో పని చేస్తున్నాడు. అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవల డాబాపైకి వెళ్లాడు. కోతుల గుంపు ఒక్కసారిగా మీదపడి కరిచింది. దీంతో ఆయన చేతికి తీవ్ర గాయమైంది. కాళేశ్వరం పీహెచ్‌సీకి, అక్కడి నుంచి మహదేవపూర్‌ ఆస్పత్రికి వెళ్లినా రక్తస్రావం ఆగలేదు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. అక్కడ ఆయనకు ఇంజక్షన్‌లు, మందులు ఇవ్వడంతో నయమైంది. ఆయన భయానికి ఆ ఇంటి నుంచి ఖాళీచేసి వేరేప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు’

వారం రోజుల్లో 15మందికి ..

ఈ వారం రోజుల్లో మండలంలో కుక్కలు, కోతుల దాడిలో 15మంది వరకు వివిధ గ్రామాలకు చెందినవారు గాయపడ్డారు. వారు మహదేవపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్లు సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement