
మాట్లాడుతున్న గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్: అక్రమ అరెస్టులతో కేంద్ర ప్రభుత్వం ప్రజాసామ్యాన్ని ఖూనీ చేస్తుందని టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లాకేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రావు మాట్లాడుతూ దేశ ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. రాహుల్‌గాంధీని నేరుగా ఎదుర్కోలేక ప్రధాని మోదీ కుట్రచేసి రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారన్నారు. అదానీ కుంభకోణంపై పార్లమెంట్‌లో రాహుల్ ఘాటుగా ప్రశ్నించడంతో మోదీ ఉక్కిరిబిక్కిరి అయ్యారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాబోయే రోజుల్లో అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అధికారం చేపట్టేది కాంగ్రెస్ పార్టీయేనని దీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దొమ్మాటి సాంబయ్య, టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, భూపాలపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో
సత్యనారాయణరావు