ఇందిరమ్మ ఇళ్ల జాబితా విడుదల చేయండి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల జాబితా విడుదల చేయండి

May 1 2026 5:57 AM | Updated on May 1 2026 5:57 AM

మంత్రి పొంగులేటికి

ఎమ్మెల్యే పల్లా వినతి

జనగామ: నియోజకవర్గానికి సంబంధించి మిగిలిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాను వెంటనే విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో విజ్ఞాపన పత్రాన్ని అందించారు. జిల్లా పరిధిలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులు, ఎదురవుతున్న సమస్యలు, ప్రజల అవసరాలను మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు. పథకాన్ని మరింత వేగవంతం చేయడానికి రెవెన్యూ, హౌజింగ్‌ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయాలని, అర్హత ఉన్న ప్రతీ కుటుంబం ఇల్లు పొందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనగామ నియోజకవర్గానికి 2025–26లో మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో 1,400 ఇళ్లు ఎమ్మెల్యే సిఫారసుల్లో భాగంగా కేటాయించాల్సి ఉండగా, వాటిలో 600 ఇళ్లు సిద్దిపేట సెగ్మెంట్‌కు వెళ్లాయన్నారు. వీటిలో 462 ఇళ్లు ఇప్పటికే మంజూరు కాగా, 138 ఇళ్లు ఇంకా బకాయిగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూల్మిట్ట కలుపుకుని కొత్తగా 128 దరఖాస్తులు వచ్చాయన్నారు. జనగామ సెగ్మెంట్‌లో కేటాయించిన 800ఇళ్లకు 577 ప్రతిపాదనలు అందాయన్నారు. బచ్చన్నపేట 424, జనగామ 395, నర్మెట 161, తరిగొప్పుల 130, జనగామ టౌన్‌ 477 ప్రతిపాదనలు వచ్చినట్లు వివరాల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు 357 ఇళ్లు మంజూరు కాగా, 223 ఇళ్లు రెండో విడతలో మిగిలి ఉన్నాయని తెలిపారు. వీటిని వెంటనే విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు.

పాఠశాలల్లో మౌలిక

సదుపాయాలు కల్పించాలి

రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి

యోగితా రాణా

జనగామ రూరల్‌: పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యాకార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌తో కలిసి వారు కలెక్టర్లతో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే విద్య వారోత్సవాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా హాజరయ్యారు. విద్యా శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. 2026–2027 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 2,700 ప్రభుత్వ పాఠశాలలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో మే 11వ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహించాలని మౌలిక వసతుల కల్పనకు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో శంకుస్థాపనలు చేయించాలన్నారు. వీసీ అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

3న చుక్కా సత్తయ్య విగ్రహావిష్కరణ

జనగామ: ఒగ్గు కళాకారుడు చుక్కా సత్తయ్య 91వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన జిల్లా కేంద్రం హైదరాబాద్‌ రోడ్డు కళ్లెం కమాన్‌వద్ద విగ్రహా విష్కరణ ఉంటుందని జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కంచె రాములు, బీసీ సంఘం జిల్లా చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ తెలిపారు. గురువారం విగ్రహావిష్కరణ మహోత్సవానికి సంబంధించి జిల్లా కురుమ సంఘం కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాయ మల్లేష్‌ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం ఉత్సవ కమిటీ చైర్మన్‌గా ఎన్నికై న కంచె రాములు మాట్లాడుతూ.. చుక్కా సత్తయ్య విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్బండ జానపద కళాకారులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీసీ సంఘం జిల్లా చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ మాట్లాడుతూ.. ఒగ్గుకళను ఒక వర్గానికి పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ వేదికలకు పరిచయం చేసిన వ్యక్తి చుక్కా సత్తయ్య అన్నారు. వేలాది మంది శిష్యులను తీర్చిదిద్దిన ఆది గురువు సత్తయ్య విగ్రహావిష్కరణకు బహుజనులు భారీసంఖ్యలో తరలిరావాలన్నారు. సమావేశంలో బండి వీరస్వామి, చౌదరపల్లి రోశయ్య, మంగళంపల్లి రాజు, పాశం శ్రీశైలం, జూకంటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement