జాతర నాటికి.. పనులు పూర్తయ్యేనా?
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతర సమయం దగ్గర పడుతున్నా పనులు పూర్తిచేయడంలో అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పనులపై మంత్రులు నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నా అధికారుల పనితీరులో మాత్రం మార్పు కనిపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్వయంగా మేడారాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ విస్తరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల పునర్నిర్మాణం పనులు సాగుతున్నాయనే తప్ప తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం వంటి పనులు ఇంకా ప్రారంభం కాని పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి హడావుడిగా పనులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
వరి కోతలపై ఆధారపడి ఏర్పాట్లు!
పనులకు అవసరమైన భూములు ఇప్పటికీ వరిసాగులో ఉండటంతో తాత్కాలికంగా వసతులు, తాగునీటి ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలు జీఐ షీట్స్ మరుగుదొడ్ల నిర్మాణం వంటి కీలక పనులకు ఆటంకం కలగనుంది. భూముల్లో సాగు చేసిన పంట చేతికొచ్చే దశకు చేరుకుంది. ఈ పనులు పూర్తయితేనే ముందుకు సాగే పరిస్థితి ఉంది.
సమీపిస్తున్న మేడారం మహాజాతర
గద్దెల పునర్నిర్మాణం పనులు మినహా మొదలు కాని జాతర పనులు
మంత్రులు ఆదేశించినా మారని అధికారులు తీరు


