
అక్రమాల డొంక కదులుతోంది..
జనగామ: పురపాలిక పాపాలపుట్ట కదులుతోంది. ఇంటి అనుమతుల నుంచి మొదలుకుని పట్టణ ప్రణాళిక, రెవెన్యూ శాఖల పరిధిలో ప్రతీ ఫైల్ దుమ్ము దులుపుతున్నారు. ‘సెటిల్‌మెంట్ కింగ్‌లు ఎవరు’ శీర్షిన సాక్షిలో ప్రచురితమైన కథనం పురపాలికను షేక్ చేసింది. దీనిపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జోరుగా సాగుతుంది. మున్సిపల్‌పై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపధ్యంలో డీఎంఏ సైతం కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మ్యుటేషన్లు, ఇంటి నంబర్ల కేటాయింపులు, పన్నుల నిర్ధారణపై నిజనిజాలను బయటకు తీసేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ డీఎల్‌పీఓ వెంకట్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు.
ఏడాది అనుమతులపై విచారణ
మున్సిపల్‌లో గడిచిన ఏడాది నుంచి ఇంటి నంబర్ల కేటాయింపులు, పన్నుల కేటాయింపులకు సంబంధించి ఫైల్ టు ఫైల్ పరిశీలన చేయాలని విచారణ అధికారిని అదనపు కలెక్టర్ ఆదేశించారు. మొదట ఆరు నెలల కాలంలో కొత్త ఇంటి నంబర్లకు అనుమతులు ఇచ్చారనే దానిపై తనిఖీ చేయాలని చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఏడాదికి పొడగించారు. సుమారు 6 వందల వరకు ఫైల్స్ ఉండగా.. ప్రస్తుతం 311 అసెస్‌మెంట్ల ఫైల్స్ బయటకు తీసి, ప్రత్యేకంగా తయారు చేసిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. కొత్త ఇంటి నంబర్ల కేటాయింపులపై డీఎల్‌పీఓ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా వెళ్లి అనుమతి ప్రకారం నిబంధలు ఉన్నాయా లేదా అని పరిశీలన చేయాల్సి ఉంటుంది. అనుమతుల సమయంలో ‘ఫార్మాల్టీస్’ ఉన్నాయా అనే కోణంలో సైతం విచారణ చేయనున్నారు. పురపాలికలో జరుగుతున్న అవకతవకల బాగోతంతో మామూళ్లశ్రీ ఉచ్చులో బలైన చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
గప్‌చుప్‌గా మున్సిపల్ వాతావరణం..
మ్యుటేషన్ల అవకతవకలపై సాక్షిలో ప్రచురితమైన కథనంతో మున్సిపల్ వాతావరణం గప్‌చుప్‌గా మారిపోయింది. అనుమతుల కోసం కొత్త ఫైల్స్ వచ్చిన సమయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలన చేస్తున్నారు. ఒకటో ముచ్చట తప్ప.. రెండో మాట వద్దంటున్నట్లు సమాచారం. అందులో పని చేస్తున్న కొందరు సర్కారు కొలువు చేస్తున్నామనే విషయాన్ని మరిచి పోయి ఇక్కడ నుంచి సమాచారం లీక్ అవుతుందని సహచరులపై బాహాటంగానే ఎత్తిపొడుపు మాటలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చర్చ జరుగుతుంది. కమిషనర్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత చిన్న చిన్న స్టాంపులు, తదితర పనులకు చేతులు తడిపే వరకు పని జరగదనే ప్రచారం బాహాటంగానే వినిపిస్తుంది. ఇందులో కొంతమంది తప్పులు చేస్తూనే, మంచి కోసం పని చేసే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురపాలికలో అంకితభావంతో పని చేయాలే తప్ప, ‘టిప్’ కోసం చేతులు చాచితే ఎవరైన సరే ఫిర్యాదు చేస్తామంటున్నారు సమాజం మేలు కోరే ప్రజలు.
విచారణ జరిపిస్తున్నాం..
జనగామ మున్సిపల్‌లో గడిచిన ఏడాది నుంచి ఇప్పటి వరకు నూతనంగా ఇంటి నంబర్ల జారీకి సంబంధించిన ఫైల్స్‌ను తనిఖీ చేస్తున్నాం. ప్రస్తుతం 311 ఫైల్ బయటకు తీయగా, మిగతా వాటిని ఒక్కొక్కటిగా సేకరిస్తున్నాం. ఇంటి నంబర్ల కేటాయింపులపై క్షేత్రస్థాయికి వెళ్తాం. తుది నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తాం.
– వెంకట్‌రెడ్డి, విచారణ అధికారి, డీఎల్‌పీఓ
ఏడాది అనుమతులపై విచారణ
ఇంటి నంబర్ల కేటాయింపులపై ఆరా
విచారణ అఽధికారిగా డీఎల్‌పీఓ