
కేజీబీవీల్లో నూతన మెనూ..
జనగామ రూరల్: కేజీబీవీల బలోపేతానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. విద్యార్థినులు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్లు ఇటీవల చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదువుతున్న బాలికలకు పౌష్టికాహారం అందించి వారిని అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మెనూలో పలు మార్పులు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించనున్నారు.
పెరిగిన మెస్ చార్జీలు
గతంలో 6–10, ఇంటర్ విద్యార్థులకు ఒకేవిధంగా నెలకు రూ.1,225 ప్రభుత్వం అందించేది. కానీ నూతన మెనూ ప్రకారం 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,330, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,540, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.2,100 అందించనున్నారు.
12 కేజీబీవీల్లో అమలు
జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో కేజీబీవీలు ఉండగా వాటిలో గతంలో 8 పాఠశాలలో ఇంటర్ విద్యను అందిస్తున్నారు. గతంలో మెనూ చార్జీలు సరిపోక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడే వారు. అన్ని సంక్షేమ హాస్టల్స్, గురుకులాలకు మెస్ చార్జీలు పెంచగా ఈ ఏడాది ప్రభుత్వం కేజీబీవీలకు పెంచడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 12 కేజీబీవీలు ఉండగా వాటిలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 2,363 విద్యార్థులు అభ్యసిస్తున్నారు.
పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ
గతంలో కంటే ఏడాది పదవ తరగతి 99 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే ఇంటర్ కూడా మంచి ఫలితాలు రావడంతో విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కూడా ఈ ఏడాది శిక్షణ ఇవ్వనున్నారు.
నూతన మెనూ ఇదే
ఉదయం: టమాట కిచిడీ, సాంబారు, బూస్ట్, పూరి, రాగి జావ, ఉప్మా, పులిహోర, వడ, బోండా, చపాతి, జీరా రైస్‌తో పాటు రోజుకు ఒక్కో రకమైన పండ్లు అందించాలి. ఇందులో అరటి, జామ, వాటర్ మిలన్, బొప్పాయి, సపోట వంటి పండ్లు అందించాలి.
మధ్యాహ్నం: టమాట పప్పుతో కూడిన అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడక బెట్టిన గుడ్డు,
చికెన్ అందించాలి.
సాయంత్రం: ఉడకబెట్టిన శనగలు, కోడిగుడ్డు బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి ఇవ్వాలి.
రాత్రి వేళ: వివిధ రకాల కూరలతో తయారు చేసిన అన్నం, సాంబారు, మజ్జిగ అందించాలి. నెలలో రెండు సార్లు మటన్, అయిదుసార్లు గుడ్లు, ప్రతీరోజు నెయ్యి అందించాలి.
నూతన మెనూ ప్రకారమే..
ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి నూతన మెనూ అమలు చేయాలని కేజీబీవీల ఎస్‌ఓలకు సూచించాం. కొత్త మెనూ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. నూతన మెనూ చార్టులు ఏర్పాటు చేయాలని సూచించాం.
– గౌసియా బేగం, బాలిక విద్యాధికారి
●
పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
పౌష్టికాహారం అందించేందుకు చర్యలు
పెరిగిన మెస్‌చార్జీలు
జిల్లావ్యాప్తంగా 12 విద్యాలయాల్లో 2,368 మంది విద్యార్థినులు

కేజీబీవీల్లో నూతన మెనూ..