
ప్రశాంతంగా పాలీసెట్
జనగామ: టీజీ పాలీసెట్ –2025 ప్రవేశ పరీక్ష జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించగా.. జిల్లాలో 1,416 మంది విద్యార్థుల కోసం మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు. 1,343 మంది ప్రవేశ పరీక్షకు (94.84 శాతం) హాజరయ్యారు. 73 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షల కో ఆర్డినేటర్ డాక్టర్ ఏ.నర్సయ్య వెల్లడించారు.
వివిధ కేంద్రాల్లో హాజరు శాతం..
జనగామ పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్‌లో 576 మంది విద్యార్థులకు 553 మంది (96 శాతం) హాజరుకాగా.. 23మంది గైర్హాజరయ్యారు. హైదరాబాద్ రోడ్డులోని సెయింట్ మెరీస్ హైస్కూల్ కేంద్రంలో 480 మందికి 450మంది (94 శాతం)హాజరుకాగా.. 30 మంది గైర్హాజరయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో 360 మంది విద్యార్థులకు 340మంది (94.44శాతం) హాజరుకాగా.. 20 మంది గైర్హాజరయ్యారు. మొత్తం పరీక్ష కేంద్రాల్లో బాలురకంటే బాలికలే ఎక్కువమంది పరీక్షకు హాజరయ్యారు.
9 గంటల నుంచి లోనికి అనుమతి
పాలీసెట్ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచే సెంటర్ల వద్దకు విద్యార్థుల రాక ప్రారంభమైంది. 9 గంటల నుంచి అధికారులు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. సెంటర్ల వద్ద డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తుతోపాటు 144 సెక్షన్ అమలు చేశారు. జిరాక్స్ సెంటర్లను మూసి వేశారు. అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే సెంటర్‌లోకి పంపించారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. నిమిషం నిబంధన అమలు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష ప్రశాంతంగా ముగియగా, పోలీసుల బందోబస్తు నడుమ పరీక్ష సామగ్రిని స్ట్రాంగ్ రూంకు తరలించారు.
1,343 మంది విద్యార్థుల హాజరు..
73 మంది గైర్హాజరు
పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు

ప్రశాంతంగా పాలీసెట్