
సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి
జనగామ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల క్షేత్ర స్థాయి పరిశీలన త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటి వరకు వెరిఫికేషన్ పూర్తయినవి ఆన్‌లైన్‌లో నమోదయ్యేలా చూడాలని చెప్పారు. రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తి చేసి, సంక్షేమ శాఖ అధికారులు తుది జాబితా ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల్లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, ఈ స్థానం కొనసాగాలంటే మరో 15 రోజుల పాటు పర్యవేక్షణ నిరంతరం ఉండాలన్నారు. ప్రస్తుత వేసవిలో తాగు నీటికి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల తుది జాబితా సిద్ధం చేయాలని, నగదు చెల్లించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేయాలని అన్నారు. మీటింగ్‌లో అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్ పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా