జనగామ రూరల్: పట్టణంలోని ఇందిరమ్మ బాణాపురం కాలనీ వద్ద నిర్మిస్తున్న బైపాస్ రోడ్డులో అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని సీపీఎం బృందం ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ జనగామ పట్టణంలోని నేషనల్ హైవే 163 నంబర్ హైదరాబాద్ రోడ్డు నుంచి హనుమకొండ రోడ్డును దుద్దేడ రోడ్డును లింక్ చేస్తూ నిర్మిస్తున్న నేషనల్ హైవే 365 బీ బైపాస్ రోడ్డు బాణాపురం వద్ద నుంచి రైల్వే ట్రాక్ నుంచి వస్తున్న బ్రిడ్జి నిర్మాణం అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించకుండా దారి మళ్లించడంతో జనగామ పట్టణంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతారన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అండర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేయాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నేషనల్ హైవే అథారిటీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూడిద గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, కనకచారి పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.